భారతీయ జనతా పార్టీ అవలంభిస్తున్న రెండు నాల్కల వైఖరి రాష్ట్రంలో పలు వివాదాలకు కారణమవుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ పద్దతి మూలంగా ప్రధాన రాజకీయ పార్టీల నడుమ పెద్ద ఎత్తున విమర్శలు పేలుతున్నాయి. బీజేపీకి మీరు దోస్త్ అంటే మీరు దోస్త్ అంటూ టీడీపీ, వైసీపీలు వాదించుకుంటున్నాయి. జనసేన పార్టీ అధికారికంగా పొత్తులో ఉంది కాబట్టి వారిని ఎవ్వరూ వేలెత్తి చూపడానికి లేదు. కానీ తెర వెనుక కమలంతో అంటకాగుతున్న రాజకీయ శక్తులు ఉన్నాయి. అవి కాసేపు వైసీపీ అనిపిస్తే ఇంకాసేపు టీడీపీ అనిపిస్తుంది. రాష్ట్ర బీజేపీలో తెలుగుదేశం పార్టీకి అనుకూలురు ఉన్నారనేది సుస్పష్టం. కన్నా లక్ష్మీనారాయణ సహా కొందరు బీజేపీ లీడర్లు టీడీపీని వెనకేసుకు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
ఇక వైసీపీ అయితే అనధికారిక చెలిమిలో ఉందనేది చాలామంది అనుమానం. కేంద్రంలో బీజేపీకి వైసీపీ పూర్తి సహాయసహకారాలు అందిస్తోంది. ఏ బిల్లు ప్రవేశపెట్టినా మారు మాట్లాడకుండా మద్దతిచ్చేస్తోంది. కొత్త వ్యవసాయ
బిల్లుకు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో ఉచిత కరెంట్ తీసుకుంటున్న రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడానికి జగన్ సర్కార్ సిద్ధమైంది. ఇవన్నీ ప్రతిపక్షం టీడీపీకి ఆయుధాలయ్యాయి. మోదీ చల్లని చూపు కోసం జగన్ ఇవన్నీ చేస్తున్నారని మండిపడుతున్నారు చంద్రబాబు. తొలుత బీజేపీతో స్నేహం చేయాలనుకున్న బాబు వారు పట్టించుకోకపోవడంతో మెల్లగా స్వరం మార్చారు. కలిసిరానప్పుడు కాకాపట్టడం ఎందుకని బీజేపీ,వైసీపీలను ముడిపెట్టి ఆరోపణలు గుపిస్తున్నారు.
టీడీపీ నేతల ఆరోపణలకు ఊతమిచ్చేలా ఉన్నాయి వైసీపీ నిర్ణయాలు కొన్ని. పోలవరం విషయంలో కొర్రులు పెడుతున్న బీజేపీ అధిష్టానం మీద వైసీపీ పెద్దగా ఒత్తిడి తెస్తున్న దాఖలాలు లేవు. పోలవరాన్ని చరతుగా పెట్టి ఢిల్లీలో మద్దతును నిలిపివేస్తామని అనట్లేదు. పైగా పోలవరాన్ని చంద్రాబాబు ఏటీఎంలా వాడుకున్నారే బీజేపీ మాటలను పడే పడే ఉటంకిస్తున్నారు. నిజానికి గతంలో బీజేపీ నేతలే పోలవరం విషయంలో చంద్రబాబు పట్టుదలను మెచ్చుకున్నారు. ఒక యజ్ఞంలా చేస్తున్నారని కితాబిచ్చారు. ఇంతలో మాట మార్చి దోచుకున్నారని వేలెత్తిచూపుతున్నారు. వారికి వంత పాడుతున్నట్టే ఉన్నాయి జగన్ సహా వైసీపీ నేతల మాటలు. తాజాగా టీడీపీ నేత జవహర్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ ఇచ్చిన స్క్రిప్టును జగన్ చదువుతున్నారని ఎద్దేవా చేశారు.