ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఆలోచించడం మానేసినట్టుంది. పాలక వర్గం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని వ్యతిరేకించాలనే బండ నియమం ఒకదాన్ని పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. సంక్షేమ పథకాలను అడుగడుగునా తప్పుబడుతూ జగన్ పాలనను రాక్షస పాలనగా అభివర్ణిస్తున్న టీడీపీకి కొత్త జిల్లాల ఏర్పాటు కూడ ఒక తప్పులానే కనిపిస్తోంది. వైఎస్ జగన్ తన ఎన్నికల హామీల్లో రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను పెంచి పరిపాలనను సులభతరం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే కసరత్తులు చేస్తున్నారు. 13గా ఉన్న జిల్లాల సంఖ్యను 25 లేదా 32 చేసే అవకాశం ఉంది. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కోక జిల్లా అన్నమాట.
ఇందులో వ్యతిరేకించడానికి ఏమీ లేదు. అలా చేస్తే పాలన సులభతరం అవుతుంది. కేంద్రం నుండి నిధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాది రాష్ట్రాలకు బీజేపీ ప్రభుత్వం బాగానే నిధుల విడుదలచేస్తోంది. దక్షిణాది రాష్ట్రాలకు మించి సహకారం ఇస్తోంది. ఇందుకు వారు చెబుతున్న రీజన్ అక్కడి రాష్ట్రాల్లో జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నిధులు ఎక్కువ ఇస్తున్నామని. ఇప్పుడు ఏపీలో కూడ ఎక్కువ జిల్లాలను ఏర్పాటు చేసుకుంటే నిధులు అడిగే వెసులుబాటు ఉంటుంది. కానీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మాత్రం ఇదంతా రాజకీయ సౌలభ్యం కోసమే చేస్తున్నారని, ఇందులో అభివృద్ధి కాంక్ష కనబడట్లేదని అంటున్నారు.
అంతెందుకు పక్క రాష్ట్రం తెలంగాణాలో ఈమధ్యే జిల్లాల సంఖ్యను 31గా చేశారు. దాని వలన అక్కడ సమస్యలేవీ రాలేదు. టీడీపీ కూడ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు. కానీ ఏపీలో మాత్రం జిల్లాలను పెంచడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తోంది. ఇదే జనాలకు నచ్చట్లేదు. ప్రభుత్వం చేసే ప్రతి పనిని తప్పుబడితే ఎలా. ముందు వాళ్ళని చేసేదేదో చేయనిస్తే తర్వాత ఫలితాలు, వాటికి మూల్యం సంగతి ఓటర్లుగా మేం చూసుకుంటాం అంటున్నారు. ఇప్పటికే జగన్ సర్కార్ ప్రతిపక్షం కోర్టులను అడ్డంపెట్టుకుని తమను ఆపుతోందని గగ్గోలు పెడుతున్నారు. ఇలాంటి తరుణంలో కొత్త జిల్లా ఏర్పాటును కూడ వ్యతిరేకిస్తే ప్రజల్లో టీడీపీ మరింత అల్లరిపాలు కావాల్సి వస్తుంది.