విజయవాడ – హైదరాబాద్ మధ్య విమాన ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు సోమవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కలిశారు. విమాన టికెట్ ధరల నియంత్రణ, సర్వీసుల పెంపు, కొత్త రూట్ల కేటాయింపుపై మంత్రికి వినతిపత్రం అందజేశారు.
ప్రధాన సమస్యలు విజయవాడ నుంచి హైదరాబాద్కు విమాన టికెట్ ధరలు ఒక్కోసారి రూ. 18 వేలకు పైగా ఉంటున్నాయని, ఇంత ధర చెల్లించినా సీట్లు దొరకడం గగనంగా మారిందని ఎంపీలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి ప్రధాన కారణం ఏటీఆర్ (ATR – చిన్న విమానాలు) సర్వీసులేనని వారు పేర్కొన్నారు. రాజధాని అమరావతికి వచ్చే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఈ చిన్న విమానాలను చూసి ఇబ్బంది పడుతున్నారని వివరించారు. అలాగే, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తమ లగేజీ విషయంలో తీవ్ర అవస్థలు పడుతున్నారని, ప్రయాణికులు వచ్చిన రెండు, మూడు రోజుల తర్వాత లగేజీ చేరుతోందన్న ఫిర్యాదులు పెరుగుతున్నాయని ఎంపీలు మంత్రికి తెలిపారు.

అవకాశం ఉన్నంత త్వరగా ఏటీఆర్ విమానాల స్థానంలో పెద్ద విమానాలను నడపాలి. విజయవాడ నుంచి అహ్మదాబాద్, వారణాసి, పూణే, కొచ్చి, గోవా నగరాలకు నేరుగా విమాన కనెక్టివిటీ కల్పించాలి. ప్రస్తుతం విజయవాడ నుంచి హైదరాబాద్, ఢిల్లీ, ముంబైకి నడుస్తున్న సర్వీసులను అంతర్జాతీయ విమానాల కనెక్టివిటీకి అనుసంధానం చేయాలి.
కేంద్రమంత్రి హామీ: ఈ సమస్యలు ఇప్పటికే తన దృష్టికి వచ్చాయని మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపీలకు తెలిపారు. వచ్చే వారం రోజుల్లో ఈ అంశాలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇక, శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు విమానంలో ఇరుముడులు తీసుకువెళ్లేందుకు ప్రత్యేక అనుమతులు, ఏర్పాట్లు చేసినందుకుగాను కేంద్రమంత్రికి టీడీపీ ఎంపీలు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

