కొజ్జా అనే పదం తప్పా ? అనేది ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్న అయిపోయింది. ఎందుకంటే, ఆ ప్రశ్నవేసింది ఎవరో కోన్ కిస్కా గొట్టం కాదు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేత, అనంతపురం టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డి. ఈమధ్యే తాడిపత్రిలోని ప్రబోధనందాశ్రమ నిర్వాహకుడైన అబ్బయ్య చౌదరితో పెద్ద గొడవైన విషయం అందరికీ తెలిసిందే. మూడు రోజుల పాటు జరిగిన గొడవ మొత్తానికి సద్దుమణిగిందనుకోండి అది వేరే సంగతి.
గొడవ మొదలైందేమో ఆశ్రమ నిర్వాహకులకు-గ్రామస్తులకు మధ్య. ఎప్పుడైతే ఆ గొడవలో గ్రామస్తులకు మద్దతుగా జేసి జోక్యం చేసుకున్నారో చివరకు ఆ గొడవ కాస్త ఆశ్రమ నిర్వాహకులకు జేసికి మధ్యగా మారిపోయింది. ఆ గొడవ సందర్భంగా పాత లెక్కలను సర్దుబాటు చేసుకోవాలని జేసి అనుకున్నా సాధ్యం కాలేదు. ఎందుకంటే, స్ధానిక పోలీసులు అనుకున్నంతగా ఎంపికి మద్దతుగా నిలవలేదు.
దాంతో ఎంపికి పోలీసుల మీద బాగా కోపమొచ్చింది. ఆశ్రమంలోని స్వామిజీ ప్రబోధానంద స్వామి అలియాస్ అబ్బయ్య చౌదరి మీద కోపం పోలీసు అధికారులపై చూపారు ఎంపి. రెండు రోజుల పాటు ఆశ్రమం దగ్గర అలాగే పోలీసు స్టేషన్ ముందు భైటాయించిన జేసి బహిరంగంగానే పోలీసులను రాయటానికి కూడా ఇబ్బందిగా ఉండే భాషలో అమ్మనాబూతులు తిట్టారు. ఆ తిట్ల పరంపరలోనే పోలీసులను ఒకటికి పదిసార్లు కొజ్జాలని సంబోధించారు.
ఆ పదమే ఇపుడు పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. పోలీసులు జేసిపై తిరగబడ్డారు. తమకు క్షమాపణ చెప్పకపోతే నాలుక చీరేస్తానంటూ పెద్ద వార్నింగే ఇచ్చారు. ఆ వార్నింగ్ కు స్పందించిన జేసి మీడియాతో మాట్లాడుతూ కొజ్జా అన్న పదం తప్పా అంటూ అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. కొజ్జా అన్న పదం తప్పని మీడియా చెబితే పోలీసుల కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెబుతానంటూ కొత్త డ్రామాకు తెరలేపారు. పోలీసులను తిట్టేటపుడు మరి కొజ్జా అన్న పదం ఏ అర్ధంలో వాడారో జేసీనే వివరించాలి. జేసి ప్రకారం కొజ్జా అనే పదం తప్పుకాని పక్షంలో నియోజకవర్గంలో అభివృద్ధిపనులు చేయలేకపోతున్నందుకు ఎంపినెవరైనా అలానే అంటే ఒప్పుకుంటారా ?