ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిందూమతాన్ని ఉద్ధరిస్తున్నట్టు ప్రజల ముందు జగన్ బ్రహ్మాండంగా నటిస్తున్నారని పదునైన విమర్శలు కురిపించారు. దేవాలయాలపై దాడులకు తెగబడుతున్న నిందితులను పట్టుకోవడం చేతకాని సీఎం జగన్, మంత్రులు ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు.
రాష్ట్రంలోని 150 ఆలయాలపై దాడులు జరిగినా విచారణకు ఆదేశించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలీసుల కంటే ముందే ప్రతిపక్షాలపైకి తప్పును నెట్టేసి తప్పించుకోవాలని జగన్ చూస్తున్నారని మంతెన దుయ్యబట్టారు. ఇప్పటికైనా వైసీపీ తన డ్రామాలు కట్టిపెడితే మంచిదని హితవు పలికారు.
కేంద్రమాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు ఇచ్చిన విరాళాన్ని వెనక్కి పంపి భక్తులను అవమానించారన్నారు. భక్తులు ఇచ్చిన విరాళాలను తిరస్కరించడాన్ని ఇక్కడే చూస్తున్నామన్నారు. నిందితులను పట్టుకోవడం చేతకాన్ని మంత్రి వెల్లంపల్లి తన పదవిని కాపాడుకునేందుకు జగన్ కాళ్లు పట్టుకుంటున్నారని, తన వ్యవహార శైలితో దేవాదాయ శాఖను అపవిత్రం చేశారని మంతెన సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.