ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ విడుదల చేయటం, జరపలేమంటూ అధికార ప్రభుత్వం హైకోర్టుకి వెళ్ళటం, జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. దీంతో ఎన్నికలు జరపాలన్న పంతం మీద ఉన్న నిమ్మగడ్డ, తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ తగిలినట్లయింది.
అయితే ఈ ఊహించని పరిణామంతో టీడీపీ నేతలు మాటల దాడి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ నేతలు నాడు ఎన్నికలు పెట్టడం రాజ్యంగబద్దమని… నేడు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమంటున్నారు అని స్థానిక సంస్థలపై మాట మార్చిన వైసీపీ నేతల మీద మండిపడ్డారు. మాట తప్పం మడమ తిప్పం అంటూ కరోనాపై అష్ట వంకరులు తిరిగిన చరిత్ర జగన్ దే అని ఆయన విమర్శించారు.
సచివాలయ వ్యవస్థ ద్వారా కరోనాను నివారిస్తామన్నారు కదా అని ప్రశ్నించారు. ఎన్నికలు సజావుగా జరిగితే అరాచకాలకు తావుండదని భయమా? అని ఆయన ప్రశ్నించారు. కరోనా ప్రమాదం పొంచివున్నప్పుడు ఎన్నికలు జరపాలని హడావుడి చేసి లేనప్పుడు ఎన్నికలు వద్దనడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. జగన్ రెడ్డి, మంత్రులంతా మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నారా? అని ఆయన ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి తన పరిపాలనపై తనకే నమ్మకం లేదు అని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారనే భయపడుతున్నారు అన్నారు.