టిటిడి బోర్డు సభ్యుడిగా టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నియామకాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. నిబంధనల ప్రకారం బోర్డు సభ్యునిగా నియామకమైన తర్వాత నెలరోజుల్లొగా బాధ్యతలు తీసుకోవాలి. సండ్ర వెంకట వీరయ్య సభ్యుడిగా నియమించి నెల రోజులు దాటినా ఇప్పటి వరకు బాధ్యతలు తీసుకోలేదు. దీంతో సండ్ర వెంకట వీరయ్య నియామకాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి సండ్ర వెంకట వీరయ్య టిడిపి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన టిఆర్ఎస్ లో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ ఇంత వరకు సండ్ర ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా టిడిపిలోనే ఉన్నారు. ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. దీంతో సండ్ర సీనియర్ నాయకుడు కావడంతో టిఆర్ఎస్ లో చేరితే ఆయనకు మంత్రి పదవి దక్కనున్నట్టు తెలుస్తోంది. మంత్రి పదవి దక్కకపోయినా కీలక పదవి దక్కే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది.