మొన్న జరిగిన ఎన్నికల్లో గెలుపు వైసిపి అభ్యర్ధిదే అంటూ సన్మానం చేస్తానని టిడిపి ఎంఎల్ఏ ప్రతిపాదన జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. కాకపోతే టిడిపి ఎంఎల్ఏ సన్మాన ప్రతిపాదన అక్కసుతో చేశారో లేకపోతే ఎకసెక్కాలాడుతున్నరో అర్ధం కావటం లేదు. ఏదేమైనా మొత్తానికి టిడిపి ఎంఎల్ఏ అభ్యర్ధి మాత్రం టిడిపి ఎంఎల్ఏ అంటే భయపడిపోయి పోలీసులను ఆశ్రయించారు.
ఇంతకీ విషయం ఏమిటంటే, కృష్ణా జిల్లాలోని గన్నవరంలో టిడిపి తరపున సిట్టింగ్ ఎంఎల్ఏ వల్లభనేని వంశీ పోటీ చేశారు. వైసిపి అభ్యర్ధిగా యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేశారు. హోరాహోరీగా పోటీ జరిగిన నియోజకవర్గాల్లో గన్నవరం కూడా ఒకటన్న విషయం తెలిసిందే.
నామినేషన్ వేసిన దగ్గర నుండి పోలింగ్ వరకు కూడా రెండు వర్గాల మధ్య అనేక సార్లు టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. అడపా దడపా ఈమధ్య కూడా ఘర్షణలు జరుగుతునే ఉన్నాయి. వైసిపి నేతలు గ్రామాల్లో తిరుగుతూ గెలుపు తమదే అంటూ చెప్పుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే హఠాత్తుగా వంశీ వైసిపి అభ్యర్ధి వెంకట్రావుకు ఫోన్ చేసి మీరే గెలుస్తున్నారు కాబట్టి సన్మానం చేయలని చెప్పారు. మీరు ఇంట్లో ఉంటే వచ్చి కలుస్తానని కూడా చెప్పటం సంచలనం కలిగిస్తోంది.
అదే సమయంలో వెంకట్రావు గెలుపుకు కష్టపడి మాజీ ఎంఎల్ఏ దాసరి బాలవర్ధనరావుకు కూడా వంశీ ఫోన్ చేసి ఇంటికి వస్తానని అడిగారట, అయితే దాసరి అవసరం లేదని చెప్పినట్లు సమాచారం. ఒకవైపు ఫోన్లు చేస్తునే వంశీ వైసిపి అభ్యర్ధి ఇంటికి వెళ్ళారు. దాంతో యార్లగడ్డ ఇంట్లో వాళ్ళు భయపడిపోయారు. ఇంటికి రాగానే విషయం తెలుసుకున్న యార్లగడ్డ వెంటనే విజయవాడ కమీషనర్ ను కలిసి వంశీపై ఫిర్యాదు చేశారు. ఇపుడీ అంశమే జిల్లాలో కలకలం రేపుతోంది. మరి పరిస్ధితిలు ఎటుపోయి ఎటు తిరుగుతుందో అన్న టెన్షన్ మొదలైంది.