వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కొందరు టీడీపీ నేతలు టార్గెట్ అయ్యారన్న విషయం నిర్వివాదాంశం. ప్రభుత్వం పనిగట్టుకుని మరీ కొందరి మీద గురిపెట్టింది. వారిలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కూడ ఉన్నారు. వైసీపీ టార్గెట్ చేసిన నేతలందరిలో గొట్టిపాటిది సపరేట్ కేస్. ఆయన మాజీ వైసీపీ నేత. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో, వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నేత. ఆ రెండు పార్టీల నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యే అయిన ఆయన ఆ తర్వాత వైకాపాలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ నుండి గెలిచి 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరిపోతారు. గొట్టిపాటి పార్టీలతో సంబంధం లేకుండా సొంత క్యాడర్ ఉంది. ఏ పార్టీ నుండి పోటీచేసినా గెలిచే సామర్థ్యం ఉన్న నేత.
అందుకే ఆయనకు 2019లో కరణం బలరామమూర్తిని నియోజకవర్గం మార్చి మరీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఎన్నికలో జగన్ ప్రభావం భారీగా కనబడినా ప్రకాశం జిల్లాలో ఫ్యాన్ గాలి వీచినా గొట్టిపాటి రవి అద్దంకిలో ఘనవిజయం సొంతం చేసుకున్నారు. ఆయన గెలుపుతో అద్దంకిలో టీడీపీ మరింత బలపడింది. అధికారం వైసీపీదే అయినా అద్దంకిలో మాత్రం ఎమ్మెల్యేగా గొట్టిపాటి ప్రభావమే కనిపించింది. ఇక తమ పార్టీ నుండి వెళ్లి తెలుగుదేశాన్ని బలపడేలా చేశారనే కోయిపమో ఏమో కానీ గొట్టిపాటి మీద కన్నెర్రజేశారు ప్రభుత్వ పెద్దలు. వరుసగా గొట్టిపాటి రవి గ్రానైట్ క్వారీల మీద సోదాలు మొదలయ్యాయి. క్రషర్లు, మైనింగ్ కార్యకలాపాల మీద కూడ నిఘా పడింది. నిత్యం ఏదో ఒక పేచీ పడుతూనే ఉంది. చిలకలూరిపేట గణపవరంలో ఉన్న క్వారీలనూ వదల్లేదు.
దీంతో గొట్టిపాటి వ్యాపార సామ్రాజ్యం కదిలిపోయింది. ఈ దెబ్బతో గొట్టిపాటి పార్టీ మారిపోతారని అందరూ భావించారు. వైసీపీ నేతలతో మంతనాలు జరిగాయనే వార్తలూ వచ్చాయి. కానీ గొట్టిపాటి మాత్రం టీడీపీలోనే ఉన్నారు. స్థానిక ఎన్నికల విషయంలో కూడ టీడీపీ మద్దతుదారులకు ఆయన అన్ని విధాలా సహాయసహకారాలు అందాయి. దీన్నిబట్టి గొట్టిపాటి పార్టీ మారే ప్రసక్తే లేదని అనిపిస్తోంది. అద్దంకి టీడీపీ శ్రేణులు సైతం అదే అంటున్నాయి. దెబ్బ మీద దెబ్బ కొడితే దారికి వస్తాడని అనుకుంటే ఒక్కొక దెబ్బ తగిలేకొద్దీ వైసీపీ మీద గొట్టిపాటి పంతం మరింత పెరిగింది. పార్టీ మారడం కాదు కదా వచ్చే దఫాలో కూడ అద్దంకిలో తెలుగుదేశం జెండానే ఎగరేస్తాననే ధోరణిలోకి వెళ్లిపోయారు ఆయన.