మొన్నీమధ్యనే చినబాబు నారా లోకేష్‌తో భేటీ అయ్యారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. కొన్నాళ్ళ క్రితం వరకూ ఆయన టీడీపీలో వున్నా.. లేనట్టే వ్యవహరించారు. కానీ, ఇంతలోనే టీడీపీలో యాక్టివ్ అయ్యారాయన.
అదే సమయంలో గంటా శ్రీనివాసరావు వ్యవహారశైలిపై ఆయన అనుచరుల్లోనే కొంత గందరగోళం వుంది. టీడీపీలో యాక్టివ్‌గా వుంటూనే, ప్రత్యామ్నాయం వైపు ఆయన చూస్తున్నారట.
రాజకీయాలకు సంబంధించి గంటా శ్రీనివాసరావు, మెగాస్టార్ చిరంజీవి సూచనలు, సలహాల మీద ఎక్కువగా ఆధారపడుతున్నట్లు కనిపిస్తుంటారు. వాస్తవానికి చిరంజీవి అయితే రాజకీయాలకు దూరంగా వున్నారు. ‘అన్నయ్య’ అని చిరంజీవిని పిలుస్తుంటారు గంటా.
ఇటీవలే చిరంజీవితో భేటీ అయిన గంటా శ్రీనివాసరావు, తనకు జనసేనలో చేరాలని వుందంటూ మనసులో మాటని బయటపెట్టారట. అయితే, జనసేనకు సంబంధించి తన వద్ద ప్రస్తావించి ఎలాంటి ప్రయోజనం లేదని చిరంజీవి తేల్చి చెప్పేశారట.
నాగబాబు లేదా పవన్ కళ్యాణ్‌తో నేరుగా మాట్లాడమని చిరంజీవి సూచించారట. పవన్ కళ్యాణ్‌ని కలిసేందుకు అవకాశం వున్నా, గంటా ఎక్కడో చిన్న మొహమాటం, బెరుకు ప్రదర్శిస్తున్నారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఎటూ టీడీపీ – జనసేన పొత్తు వుంటుంది గనుక, జనసేనలోకి వెళ్లడమెందుకు.? అన్న దిశగా అనుచరులూ గంటాకి సూచిస్తున్నారట. గంటా వ్యవహారశైలిపై అనుమానమొచ్చిన చంద్రబాబు, ఆయన మీద ప్రత్యేక నిఘా పెట్టారని తెలుస్తోంది.