చంద్రబాబుది అవినీతి పాలనే..టిడిపి ఎంఎల్ఏ (వీడియో)

మనసులోని మాట బయటకు వచ్చేసిందో లేకపోతే ఉద్దేశ్యపూర్వకంగానే చెప్పారో తెలీదుకానీ తిరుపతి తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏ సుగుణమ్మ ఓ మాట చెప్పారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఎంఎల్ఏ చంద్రబాబు పాలన గురించి ఓ మాట చెప్పి పెద్ద బాంబు వేశారు. సుగుణమ్మ చెప్పిన మాట విన్న మీడియా మిత్రులతో పాటు అక్కడే ఉన్న తెలుగుదేశంపార్టీ నేతలు కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు.

 

ఇంతకీ సుగుణమ్మ ఏం చెప్పారంటే చంద్రబాబు పరిపాలనలో రాష్ట్రం దేశంలోనే అవినీతి రాష్ట్రంగా తయారైందన్నారు. దేశంమొత్తం మీద అత్యంత అవినీతి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కు మూడో స్ధానం దక్కిందని స్పష్టంగా చెప్పారు. ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా నిర్వహించిన సర్వేలో అవినీతి విషయంలో ఏపికి మూడోస్ధానం దక్కిందని ఎంఎల్ఏ చెప్పటం విశేషం.

ఇప్పుడంటే చంద్రబాబు పరిపాలన గురించి ఎంఎల్ఏ చెప్పారుకానీ గతంలో అసెంబ్లీలోనే తన పరిపాలనపై చంద్రబాబే స్వయంగా సర్టిఫికేట్ ఇచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. దేశం మొత్తం మీద అభివృద్ధిలో కానీ అవినీతిలో కానీ ఏపిని నెంబర్ 1 గా తీర్చిదిద్దుతానని బల్లగుద్ది మరీ ప్రకటించారు. అంతకుముందు తర్వాత చినబాబు నారా లోకేష్ కూడా చాలాసార్లు ఇంచుమించు అదే విధంగా మాట్లాడారు. ఇపుడు తిరుపతి ఎంఎల్ఏ కూడా అదే విషయాన్ని చెప్పారు.

 

రాజమండ్రిలో జనసేన అధినేత చంద్రబాబు పాలనలో జరుగుతున్న దోపిడిని, అవినీతిని గురించి చెప్పిన మరుసటి రోజే టిడిపి ఎంఎల్ఏ కూడా అదే మాట చెప్పటానికేమైనా కనెక్షన్ ఉందా అని అనుమానిస్తున్నారు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో సుగుణకు టిక్కెట్టిచ్చే విషయంలో చంద్రబాబు సుముఖంగా లేరని ప్రచారం జరుగుతోంది. ఆ విషయాన్ని గ్రహించిన ఎంఎల్ఏ పవన్ కల్యాణ్ తో టచ్ లో ఉన్నారట. ఏదేమైనా మీడియా సమావేశంలో చంద్రబాబు పాలనపై ఎంఎల్ఏ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతోంది.