అచ్చెన్నాయుడి అతి.! టీడీపీకి వైఎస్ జగన్ ఓటేశారట.!

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒకింత అతి ప్రదర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు తమకు పడ్డాయని అచ్చెన్నాయుడు చెప్పుకోవడాన్ని తప్పు పట్టలేం. కానీ, కంగారులో వైఎస్ జగన్ ఓటు టీడీపీకి వేశారని అచ్చెన్నాయుడు చెప్పడమే హాస్యాస్పదం.

టీడీపీకి అసెంబ్లీలో మొత్తం 23 మంది ఎమ్మెల్యేలున్నారు. అందులో నలుగురు పార్టీ ఫిరాయించేశారు. ఆ నలుగురు ప్రస్తుతం వైసీపీలో వున్నారు. వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్యే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేశారు. ఆ నలుగుర్నీ వైసీపీ సస్పెండ్ చేయడం కూడా జరిగింది.

‘ఏమో ఎవరికి తెలుసు, ఆ నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారో.. లేదంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పొరపాటున టీడీపీకి ఓటేశారో..’ అంటూ అచ్చెన్నాయుడు వెటకారాలు చేస్తున్నారు. వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల్ని టీడీపీ వ్యూహాత్మకంగా కొనుగోలు చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ విషయమై పెద్ద రచ్చ కూడా జరుగుతోంది. 10 నుంచి 20 కోట్ల మేర చెల్లింపులు టీడీపీ ఒక్కో ఎమ్మెల్యేకీ చేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. ముందు ముందు ఈ విషయమై కేసులు నమోదై, వ్యవహారం అరెస్టుల వరకూ వెళుతుందేమో కూడా.! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు, అనూహ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ అభ్యర్థిని గెలిపించుకోవడం.. వెరసి, టీడీపీలో ఓవర్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అయి వుండొచ్చు.

కాగా, పొత్తుల చర్చలు ఎన్నికల సమయంలో జరుగుతాయనీ, ప్రస్తుతానికి పొత్తుల గురించి ఆలోచించడంలేదని అచ్చెన్నాయుడు ప్రకటించడం ఆశ్చర్యకరం. చాలాకాలంగా జనసేనతో కలిసి టీడీపీ రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే.