వైఎస్ జగన్ అరెస్టుని కోరుకుంటున్న టీడీపీ.!

ఇందులో వింతేముంది.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మళ్ళీ జైలుకు పంపాలనే ఆలోచనతోనే వుంటుంది తెలుగుదేశం పార్టీ.! కానీ, అది జరిగే పనేనా.? ఒకవేళ వైఎస్ జగన్ జైలుకు వెళితే, తెలుగుదేశం పార్టీకి వచ్చే లాభమేంటి.?

వైఎస్ వివేకా హత్య కేసులోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళాలన్నది తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళడం సాధ్యం కాకపోతే, వైఎస్ అవినాశ్ రెడ్డి అయినా జైలుకు వెళ్ళాలన్నది టీడీపీ ఎదురు చూపుల సారాంశం.

రాజకీయ నాయకులు జైళ్ళకు వెళితే ఏమవుతుంది.? పాపులారిటీ మరింత పెరుగుతుంది.! కానీ, జైలుకు వెళ్ళే విషయమై రాజకీయ నాయకులు ఎందుకు యాగీ చేస్తారు? పబ్లిసిటీ కోసం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో దాపరికం ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీకి ఇదంతా తెలియకుండా వుంటుందా.?

ఇక, ‘వైఎస్ జగన్ లేదా వైఎస్ అవినాశ్ రెడ్డి.. ఇద్దరిలో ఎవరో ఒకర్ని జైలుకు పంపితే తప్ప, బీజేపీని మేం నమ్మం..’ అంటున్నారు పలువురు టీడీపీ నేతలు. సోషల్ మీడియా వేదికగా తెలుగు తమ్ముళ్ళు ఈ అభిప్రాయాన్ని చాలా బలంగా వ్యక్తం చేస్తున్నారు. కానీ, బీజేపీ అంత రిస్క్ తీసుకుంటుందా.?

నాలుగేళ్ళు ఉపేక్షించి, ఇప్పుడు వైఎస్ జగన్ మీద ఎలాంటి ‘చర్య’ తీసుకున్నా, మొదటికే మోసమొస్తుంది. ఆ విషయం బీజేపీకి కూడా బాగా తెలుసు. మరెందుకు బీజేపీ మీద అనవసర విమర్శలు.? అంటే, అదంతే.

గతంలో ‘పోలవరం ప్రాజెక్టుని ఏటీఎంలా వాడుకున్నారు చంద్రబాబు..’ అంటూ సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారు..’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పుడు విమర్శలు చేస్తన్నారు. అవి జస్ట్ రాజకీయ విమర్శలు మాత్రమే.

చంద్రబాబుని జైలుకు పంపేంత రిస్క్.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డే చేయలేదు. అలాంటి రిస్క్ బీజేపీ జగన్ మోహన్ రెడ్డిని జైలుకు పంపే విషయంలో ఎంందుకు చేస్తుంది.?