కర్నూల్లోకి ప్రవేశిస్తున్న టిడిపి మూడో కృష్ణుడు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, ఐటి, పంచాయత్ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ కి పోటీ చేస్తారా, చేస్తే ఆయన కర్నూలు టవున్ నుంచి పోటీచేస్తారా?

లోకేష్ కర్నూలు రావడం అయ్యేది కాదు, పొయ్యేది కాదు, అందుకని టిజి వేంకటేశ్, ఎస్ వి మోహన్ రెడ్డిలను కాదని తెలుగుదేశం పార్టీ మూడో కృష్ణుడిని రంగంలోకి తీసుకువచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఈ మూడో కృష్ణుడెవరో కాదు, జిల్లా టిడిపి అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు.

సోమిశెట్టి అనే శెట్టిగారు అల్లాటప్పా టిడిపి లీడర్ కాదు. గాలివాటం చూసుకుని పార్టీలు మారిమారి ప్రస్తుతానికి టిడిపిలోకి దూకిన వలస పక్షి కాదు. పదహారాణాల టిడిపి నేత. పార్టీ పుట్టినప్పటి నుంచి టిడిపిలో ఉన్నవాడు. అంతేకాదు, మూడు నాలుగేళ్లు మినహాయించి టిడిపికి జిల్లా అధ్యక్షుడిగా తొలినుంచి కొనసాగుతున్నవాడు. పెద్దగా పదవులు అశించినవాడుకాదు, ఇచ్చిందేందో తీసుకునేవాడు. నిరసన అనేది తెలియని వాడు. చంద్రబాబు నాయుడికి చాలా ముఖ్యుడు. అందువల్ల టిజికి వద్దు, ఎస్వీకి వద్దు, సోమిశెట్టికి ఇస్తే లాయలిస్టుకు టికెట్ ఇచ్చినట్లుందని ఉన్నతస్థాయిలో చర్చ నడుస్తూ ఉందని సీనియర్ నాయకుడొకరు ‘తెలుగు రాజ్యం’ కుతెలిపారు.

కర్నూలు సీటు కోసం తగవులాడుకుంటూ రాజ్యసభ సభ్యుడు టిజి వేంకటేశ్, సిటింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి లోకేష్ ను రంగంలోకి లాగుతుండటంతో ఇది గిట్టనీ పార్టీ నేత సోమిశెట్టి గురించి ఆలోచన చేశారని తెలిసింది.

తాను సిటింగ్ ఎమ్మెల్యే కాబట్టి తనకే సీటు ఇవ్వాలని ఎస్వీ మోహన్ రెడ్డి వాదిస్తున్నారు. ఆ సీటు తన కొడుకు భరత్ కు ఇవ్వాలని టిజ వెంకటేశ్ కౌంటరిస్తున్నారు. ఈ సారి ఇవ్వకపోతే, భరత్ 2024 దాకా ఆగాలి. టూ లేట్ అనేది ఆయన ఆవేదన. ఈ రెండుకుటుంబాలు ఇద్దరు రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలతో కర్నూల్ ను గప్పిట్లో పెట్టుకున్నాయి.

ఎందుకోగాని మంత్రి కెయి కృష్ణ మూర్తి ఫామిలీ హెడ్ క్వార్టర్స్ కర్నూలే అయినా అసెంబ్లీ సీటును ఎపుడూ సీరియస్ గా తీసుకోలేదు. ఆయన దృష్టంతా పత్తికొండ, డోన్ నియోజకవర్గాల మీదే ఉంది. కాకపోతే, విధిలేని పక్షంలో కర్నూల్ లోక్ సభ స్థానం గురించి ఆలోచించేవారు. దీనితో ఆళ్లగడ్డ నుంచి వచ్చిన ఎస్ వి మోహన్ రెడ్డి, లేటు గా రాజకీయాల్లోకి వచ్చిన టిజి వేంకటేశ్ కర్నూలును కంట్రోల్ చేస్తున్నారు. వ్యాపార పరంగా ఈ అర్బన్ సీటు వాళ్ల కి చాలా అవసరం. దీనితోనే అక్కడ పోటీ మొదలయింది. ఎవరూ ఈ సీటు వదలుకునేందుకు సిద్ధంగా లేరు. వదలుకోవలసి వస్తే తీవ్ర పరిణామాలుంటాయేమో. పరస్పరం ఓడించుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఇద్దరుకలసి లోకేష్ ను రంగంలోకి లాగారు. కర్నూలు ను వదలు కునే ప్రసక్తి లేదని, నారా లోకేష్ పోటీ చేస్తానంటే మాత్రం అభ్యంతరంలేదని ఇద్దరు ప్రకటించారు.ఇపుడు ఈ వివాదాన్ని చిన్న బాబు ఎలా పరిష్కరిస్తారు. వీళ్లిద్దరికి తగిన సమాధానం చెప్పేందుకు పార్టీ సోమిశెట్టి వేంకటేశ్వర్లు పేరును పరిశీలిస్తున్నదని చెబుతున్నారు. వైశ్యుల వోట్లే కావాలనుకుంటే సోమిశెట్టి చాలునని పార్టీ అభిప్రాయం.అన్నింటికి మించి సోమిశెట్టి టిజి, ఎస్వీలిద్దరికి అయిన వాడే.

ఎమ్మెల్యే సీటు తనకే వస్తుందని ఎస్వీ మోహన్‌రెడ్డి అపుడే క్యాండిడేట్ అని ప్రకటించుకుని క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టారు. కానే కాదు, వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు టీజీ భరత్‌ యే బరిలో ఉంటారని తండ్రి వేంకటేశ్ ప్రకటించారు.