రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో బీజేపీ జెండాను పాతడనికి బీజేపీ అధిష్టానం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా ఏపీలో . ఎందుకంటే 2019 ఎన్నికలో టీడీపీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఇప్పుడు ప్రజల్లో ఆపార్టీపై నమ్మకం లేదు.
ఇలాంటి సమయంలో రాష్ట్రంలో ప్రజలకు చేరువవుతూ, రానున్న రోజుల్లో వైసీపీకి పోటీగా నిలవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపధ్యంలోనే ఇప్పుడు కర్నూల్ కు చెందిన ఒక నాయకుడు చేస్తున్న పనులు టీడీపీ కుసాలు కదిలేలా చేస్తున్నాయి. ఆ నాయకుడు ఎవరంటే ఒకప్పుడు టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి, బీజేపీ నేత ఐన టీజీ వెంకటేష్. ఆయన ఇప్పుడు కర్నూల్ లో జరుపుతున్న రాజకీయాలు చూస్తుంటే రానున్న రోజుల్లో టీడీపీకి కర్నూల్ లో నామ రూపాలు లేకుండా చేస్తుందని సమాచారం.
ఈ క్రమంలోనే జిల్లాలో వేరే పార్టీలలో ఉన్న ప్రముఖ నాయకులను బీజేపీలో చేరిపించేందుకు వెంకటేష్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీలో నమ్మకంగా ఉండే నాయకులను బీజేపీలో చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో టీడీపీకి భవిష్యత్తు ఉందని, బీజేపీ టీడీపీ స్థానాన్ని ఆక్రమిస్తుందని, వైసీపీ నాయకులు మీకు దూరంగా ఉండాలంటేమీకు బీజేపీ సహాయం అవసరమని చెప్తూ కీలక నేతలకు వెంకటేష్ గాలం వేస్తున్నారు. కర్నూల్ జిల్లాకు చెందిన కీలక నాయకురాలు మాజీ మంత్రి అఖిల ప్రియతో టీడీపీలో ఉంటే మీకు భవిష్యత్తు లేదని ఆమెను పార్టీ మారేలా ప్రేరేపిస్తున్నారట. అలాగే మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఫ్యామిలీని కూడా బీజేపీలోకి రప్పించేందుకు టీజీ వెంకటేష్ ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే కోట్లతో మంతనాలు కూడా పూర్తయ్యాయని ఆయన తన ఫ్యామిలీతో సహా వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక, పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి ఫ్యామిలీ కూడా టీజీ వెంకటేష్ బాటలో కమలం గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారట.
ఒకప్పుడు తన వెనకాల నడిచిన వెంకటేష్ ఇప్పుడు తన పార్టీనే జిల్లాలో నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని చంద్రబాబు చింతిస్తున్నాడని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పార్టీని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్న వెంకటేష్ పై టీడీపీ అధినేత రానున్న రోజుల్లో ఎలాంటి వ్యూహాన్ని రచిస్తారో వేచి చూడాలి.