మొదటి నుండి ఆంధ్రా విషయంలో భారతీయ జనతా పార్టీ ద్వంద వైఖరిని అవలంభిస్తున్న సంగతి తెలిసిందే. అటు వైసీపీకి పూర్తి మద్దతు ఇవ్వకుండా ఇటు టీడీపీని నిర్లక్ష్యం చేయకుండా వైసీపీ తెలివైన రాజకీయం చేస్తున్నామని అనుకుంది. కానీ చివరికి అదే రాష్ట్ర స్థాయిలో బీజేపీ పరిస్థితిని అగమ్యగోచరంగా మార్చింది. కేంద్రం వైఎస్ జగన్, చంద్రబాబుల పట్ల తీసుకున్న రెండు నాలుకల విధానం మొదటి నుండి రాష్ట్రంలో పార్టీకి తలనొప్పిగానే ఉంటూ వచ్చాయి. పై నుండి పర్మిషన్ రానిదే ఇక్కడ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏ నిర్ణయమూ తీసుకోవడానికి లేదు. అసలు అధిష్టానవర్గం ఎలా ఆలొచిస్తోందో తెలిస్తే దానికి అనుగుణంగా నడుచుకునే వీలుంటుంది.
అది తెలీకే కన్నా ఏం మాట్లాడినా దుమారం రేపుతోంది. తాజాగా ఆయన మూడు రాజధానుల బిల్లును ఆమోదించవద్దని గవర్నర్ గారికి లేఖ రాశారు. దీంతో సొంత పార్టీలోనే విభేదాలు మొదలయ్యాయి. మూడు రాజధానులకు వ్యతిరేకమని మేము చెప్పామా అని కొందరు కన్నా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే అమరావతికి కట్టుబడి ఉన్నామని ఇంకొందరు అంటున్నారు. మొత్తానికి కన్నా రాసిన లేఖ కేంద్రానికి కోపం తెప్పించిందని, కన్నా మీద చర్యలు తీసుకోవడానికి హైకమాండ్ సిద్దంగా ఉందని వార్తలు వస్తున్నాయి.
జీవీఎల్ నరసింహారావు లాంటి నేతలు రాష్ట్ర రాజధాని అనేది కేంద్రం పరిధిలోని అంశం కాదని, అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని అంటే టీజీ వెంకటేష శీతాకాల సమావేశాలు కర్నూలులో నిర్వహించాలని అంటూ మూడు రాజధానులకు అనుకూలంగా మాట్లాడితే సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి నేతలు మోడీ శంఖుస్థాపన చేసిన అమరావతినే రాజధానిగా కొనసాగించాలని బల్లగుద్ది చెబుతున్నారు. దీంతో కన్నా లక్ష్మీనారాయణ ఏం మాట్లాడినా, ఎటు మాట్లాడినా తప్పే అవుతోంది. ఇదే ప్రస్తుతం ఆయన మీద టీడీపీ కొవర్ట్ అనే ఆరోపణలకు దారి తీసింది. ఈ పరిణామం రాష్ట్ర బీజేపీలో కల్లోలం సృష్టించింది. ఇదే గందరగోళం ఇంకొనాళ్లు కొనసాగితే పార్టీ కకావికలం కావడం ఖాయం.