జనసేన వైపు చూస్తోన్న టీడీపీ ముఖ్య నేతలు.?

ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా బలాబలాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, వైసీపీ మొదటి స్థానంలో వుంది. టీడీపీది రెండో స్థానం. జనసేన మూడో స్థానంలో.. ఆ తర్వాత బీజేపీ, చివరి స్థానంలో కాంగ్రెస్.. ఇంకా అట్టడుగున వామపక్షాలూ వుంటాయ్.

ఎట్టి పరిస్థితుల్లోనూ 175 సీట్లకుగాను 175 సీట్లూ కొల్లగొట్టేస్తామని అధికార వైసీపీ అనుకుంటోందిగానీ.. అది అంత తేలిక కాదని, వైసీపీ అధినాయకత్వానికీ తెలుసు. కానీ, అలా చెబితేనే.. ఇంకోసారి అధికార పీఠమెక్కగలుగుతామని సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటోంది వైసీపీ.

ఇక, టీడీపీ విషయానికొస్తే.. ‘చావో రేవో’ అనే పరిస్థితి వుంది ఆ పార్టీకి. టీడీపీ గనుక ఈసారి ఓడిపోతే, తెలుగు రాష్ట్రాల్లోంచి పూర్తిగా గల్లంతయిపోతుంది. మరి, జనసేన సంగతేంటి.? గెలుపోటములు జనసేన మీద పెద్దగా ప్రభావం చూపవు. ఎందుకంటే, నిండా మునిగినోడికి చలేంటి.? అన్నది జనసేన పరిస్థితి.

2019 ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెలిచిన జనసేన, ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో రెండంకెల సీట్లైతే సాధించే అవకాశం వుంది.. ఒంటరిగా బరిలోకి దిగినా.. టీడీపీతో పొత్తు పెట్టుకున్నాగానీ.!

అయితే, జనసేనకి భవిష్యత్తు వుందని టీడీపీలో కొందరు ముఖ్య నేతలు భావిస్తున్నారట. టీడీపీకి భవిష్యత్తు కష్టమేనన్న భావనలో వున్న ఆ ముఖ్య నేతలు, జనసేన వైపుగా చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆ లిస్టులో ఓ యువ ఎంపీ వున్నారనే ప్రచారం జరుగుతోంది. జనసేనానితో ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు టచ్‌లోకి వెళ్ళారనీ, త్వరలోనే వాళ్ళంతా జనసేనలోకి దూకేస్తారనీ.. గుసగుసలు వినిపిస్తున్నాయ్.