నారా లోకేష్ ను చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో చూడాలనుకున్నారో ఆ స్థాయిలో చూడలేకపోతున్నారు. అందుకు అనేక కారణాలున్నాయి. స్వతహాగానే లోకేష్ కొద్దిగా నెమ్మదస్తుడు, మెతక. తండ్రి చాటు కొడుకుగా కొన్నాళ్ళు బాగానే రాజకీయం చేసిన ఆయన ఎప్పుడైతే ముందుకొచ్చారో అప్పటి నుండి అపజయాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎమ్మెల్సీ పదవి ద్వారా మంత్రి అవడమే లోకేష్ చేసిన మొదటి పొరపాటు. టీడీపీకి భవిష్యత్తే లేకుండా చేయాలనే ఆలోచనలో ఉన్న వైసీపీ ఎన్నో ఏళ్ల నుండి లోకేష్ ను నిర్వీర్యం చేయడానికి కంకణం కట్టుకుని మరీ పనిచేస్తోంది. ఆయన మీద అసమర్ధుడు అనే ముద్రవేసి విపరీతమైన ప్రచారం చేసింది.
ఆ ప్రచారానికి తోడు లోకేష్ చేసిన చిన్న చిన్న పొరపాట్లు, ఎన్నికల్లో ఓటమి అన్నీ ఆయన నిజంగానే అసమర్ధుడనే భావనను ప్రజల్లో కలిగించాయి. అసలు లోకేష్ లో నాయకత్వ లక్షణాలే లేవని వైసీపీలో విజయసాయిరెడ్డి లాంటి నేతలు అంటుంటారు. ఒకానొక దశలో టీడీపీ శ్రేణుల్లో కూడ లోకేష్ చంద్రబాబుకు తగిన వారసుడు కాదేమో అనే భావం ఏర్పడింది. లోకేష్ పరాజయాలు కాళ్ళ ముందు కనిపిస్తుండటంతో కిందిస్థాయి నేతలు చాలామంది భవిష్యత్తులో లోకేష్ సారథ్యంలో పార్టీ ఎన్ని కష్టాలుపడాలో అనుకునేవారు. కానీ అందరూ అనుకున్నంత బలహీనుడేం కాదు లోకేష్. ఈ సంగతి టీడీపీ నేతలకు తాజాగా తెలిసొచ్చింది.
ఇటీవలే అమరావతిలో పర్యటించిన ఆయన రైతుల దీక్షలో మాట్లాడి అనంతరం పార్టీ అనుబంధ కమిటీలతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో లోకేష్ పదవుల్లో ఉన్న నేతలకు గట్టిగా ఆదేశాలిచ్చారట. పదవులనేవి పేరుకు మాత్రమే కాదనో, పార్టీ కోసం పనిచేయడానికని, ఎవరైనా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకుంటే మొహమాటం లేకుండా పీకేస్తామని, కష్టపడేవారికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని, ప్రాధాన్యం ఇస్తుందని కుండబద్దలుకొట్టి చెప్పారట. లోకేష్ నుండి ఆ స్థాయి దూకుడు అస్సలు ఊహించని తెదేపా నేతలు అవాక్కై చినబాబులో ఇంత విషయం ఉందా… పర్లేదు రాటుదేలుతున్నాడు అని అనుకున్నారట.