శుక్రవారానికి, మన రాజకీయ నాయకులకు అవినాభావ సంబంధం ఉన్నట్టు ఉంది. శుక్రవారం పేరు చెబితేనే మన లీడర్లు వణికిపోయే పరిస్థితులు ఉన్నాయి. గతంలో వైఎస్ జగన్ కేసులన్నీ కోర్టుల్లో శుక్రవారమే హియరింగ్ కు వచ్చేవి. ఆరోజున ఆయన ఖచ్చితంగా కోర్టులో హాజరుకావాల్సి ఉండేది. ఎన్ని పనులున్నా, ఎక్కడున్నా ఆరోజున మాత్రం ఆయన కోర్టులో ఉండాల్సిందే. చివరికి పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడ ఆయన శుక్రవారం కోర్టుకు వెళ్లేవారు. ఈ అంశాన్ని పట్టుకుని జగన్ మీద టీడీపీ నేతలు, ఆ పార్టీ శ్రేణులు చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. శుక్రవారం వచ్చిందంటే జగన్ మీద సోషల్ మీడియాలో సెటైర్లు పేలేవి. ఎల్లో మీడియా పనిగట్టుకుని శుక్రవారం పూట జగన్ కేసుల మీద డిబేట్లు పెట్టేవి.
జగన్, వైసీపీ నేతలు టీడీపీ లీడర్లకు ఎన్ని విషయాల్లో సమాధానాలు చెప్పినా ఈ శుక్రవారం కౌంటర్లకు మాత్రం నోరు మెదపలేకపోయేవారు. చివరికి శుక్రవారం రోజున కోర్టుకు హాజరుకాకుండా వెసులుబాటు కల్పించాలని పిటిషన్ పెట్టుకున్నారు. అయినా సీబీఐ కోర్టు ఆ పిటిషన్ను అనుమతించలేదు. చివరికి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కోర్టులో ప్రత్యక్ష హాజరు నుండి ఆయనకు మినహాయింపు కలిగింది. అలా అనేక నెలలపాటు జగన్‌ను శుక్రవారం పేరు చెప్పి హేళన చేసిన చంద్రబాబు అండ్ బ్యాచ్ ఇప్పుడు అదే శుక్రవారం పేరు చెబితే భయపడుతున్నారు. ఏ రోజునైతే చూపించి టీడీపీ తనను ఆటపట్టించిందో ఇప్పుడు అదే శుక్రవారాన్ని చూసి చంద్రబాబు సహా తెలుగుదేశం నేతలు భయపడేలా చేశారు జగన్.
శుక్రవారం రోజునే తెలుగుదేశం నేతలు అరెస్ట్ కావడమో, ఆ పార్టీ నేతలకు చెందిన ఆస్తుల మీద సోదాలు జరగడమో జరుగుతున్నాయి. ఆ పార్టీ కీలక నేత అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసింది శుక్రవారం రోజునే. అలాగే శుక్రవారం విశాఖలో ఉన్న టీడీపీ నేతలు సబ్బం హరి, బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ కు చెందిన గీతం యూనివర్సిటీ అక్రమ కట్టడాల మీద మున్సిపల్ అధికారులు దాడులు చేసి కూల్చడం జరిగింది. ఇంకొందరు నేతల ఆస్తుల మీద కూడ ఇదే తరహాలో దాడులు జరుగుతున్నాయి. దీంతో శుక్రవారం వస్తోందంటే విశాఖలో ఉన్న టీడీపీ నేతలు వణికిపోతున్నారు. ఎప్పుడు ఎవరి మీద ఏ కారణం చూపి సోదాలు, కూల్చివేతలు జరుగుతాయోనని బిక్కిబిక్కుమంటున్నారు.
ఈ శుక్రవారం టీడీపీ నేతలను ఎంతగా భయపెడుతోందంటే శుక్రవారం వస్తే విశాఖలో ప్రజలు గడగడలాడుతున్నారు. సెలవు రోజుల్లో ఎవరి ఆస్తిని కూలగొడతారా, ఎవరిని అరెస్టు చేస్తారోనని భయపడే వాతావరణం నెలకొంది అంటూ చంద్రబాబుగారే స్వయంగా అన్నారు అంటే జగన్ శుక్రవారం ఫార్ములా వారి మీద ఎంతలా పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇక టీడీపీ శ్రేణులైతే ఒకప్పుడు జగన్ ను శుక్రవారం పేరు చెప్పి హేళన చేసిన మనమే ఈరోజు శుక్రవారం వస్తోంది అంటే ఏ లీడర్ ఎలా బుక్కవుతాడో అని భయపడాల్సి వస్తోంది అనుకుంటున్నారు.