ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధను బరిలో నిలబెట్టాలని చంద్రబాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న జరగబోయే ఈ ఎన్నికల్లో ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవాలంటే.. కనీసం 23 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమవుతుంది. ఈ లెక్కన చూసుకుంటే… టీడీపీ తరపున 23 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయినా.. ప్రస్తుతం ఉన్నది 19 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే! మరి లెక్కలు ఇలా ఉంటే… చంద్రబాబు ఏ ధైర్యంతో అనురాధను బరిలోకి దించుతున్నారు. గతంలో రాజ్యసభ ఎన్నికల సమయంలో వర్ల రామయ్యను చేసినట్లు చేయాలని అనుకుంటున్నారా అంటే… రెండు రకాల సమాధానాలొస్తున్నాయి.
అవును… సైకిల్ గుర్తుపై గెలిచిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు… బాబుకు బై చెప్పి బయటకు వెళ్లిపోయిన పరిస్థితి! ఈ పరిస్థితుల్లో టీడీపీకి ఉన్నవి 19 సీట్లే. అయినా కూడా అనురాధను సిద్ధం చేస్తున్నారు బాబు. అయితే… ఇక్కడ బాబు రెండు రకాల వ్యూహాలు పన్నారని తెలుస్తుంది. ఒకటి… మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలూ టీడీపీకి మద్దతుగా ఓటువేయని పక్షంలో.. విప్ జారీ చేయొచ్చని! ఒక వేల అది వికటించి దానివల్ల పెద్దగా ప్రతిఫలం ఉండదు.. ఆ చర్యల సమయం వచ్చేటప్పటికి ఎన్నికలు కూడా సమీపించొచ్చు అని అనుకుంటే… వైకాపాలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలైనా తనను గట్టెకిస్తారని బాబు ప్లాన్ అంట.
రానున్న ఎన్నికల్లో టికెట్ దక్కదనే నిర్ణయానికి వచ్చిన అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు.. బయటకు వెళ్లిపోయిన నలుగురు ఎమ్మెల్యేల ఓట్లను భర్తీ చేసే క్రమంలో… తమకు ఓట్లు వేస్తారని నమ్ముతున్నారంట టీడీపీ అధినేత! ఇప్పటికే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సొంత పార్టీపై తిరుగుబాటు బావుగా ఎగురవేసిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరితో పాటు నెల్లూరు జిల్లాకే చెందిన మరో ఎమ్మెల్యే, రాజధాని ప్రాంతానికి చెందిన ఒక మహిళా ఎమ్మెల్యే తమకు అండగా ఉంటారని టీడీపీ గట్టి నమ్మకంతో వుందట.
ఇలా బాబు అంచనా వేస్తున్నట్లు ఆ నలుగురు వైకాపా ఎమ్మెల్యేలూ టీడీపీ కి ఓటు వేసి అనురాధను గెలిపిస్తే… అప్పుడు మళ్లీ రెండు రకాల చర్చలు మొదలవుతాయి. తన ఎమ్మెల్యేలను జగన్ లాక్కుంటే… జగన్ ఎమ్మెల్యేలను తాను లాక్కున్నానని బాబు తనదైన గర్వంగా చెప్పుకోవచ్చు! ఒకవేల బాబు కోరిక తీరకుండా.. ఆ నలుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరైతే… జగన్ అప్రజాస్వామిక చర్యల వల్ల తనకు రావాల్సిన ఒక్క సీటూ రాలేదని చెప్పుకోవచ్చు. ఆ నైతిక హక్కు బాబుకి లేకపోయినా.. తగిలించే మీడియా ఉండటం వల్ల అది పెద్ద పనేమీ కాదు!
ఈ లెక్కన చూసుకుంటే… అనురాధ ఎమ్మెల్సీ అవ్వడం అనేది అటు టీడీపీ నుంచి గెలిచి, బాబు కు బై బై చెప్పిన ఆ నలుగురు ఎమ్మెల్యేల చేతుల్లోనో… ఇటు జగన్ పై అల్లిగి కొమ్మను నరుక్కున్న ఈ నలుగురు వైసీపీ ఎమ్మెల్యేల చేతుల్లోనో ఉందన్నమాట!