జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నం ఘటనలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న టిడిపి నేత, ఎయిర్ పోర్టు క్యాంటిన్ యజమాని హర్షవర్ధన్ చౌదరి మొత్తానికి విచారణకు హాజరయ్యారు. హత్యాయత్నం ఘటనను ఎన్ఐఏ విచారిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఘటనకు సంబంధించి చాలామందిని విచారించాలని ఎన్ఐఏ నోటీసులిచ్చింది. అయితే చౌదరి మాత్రం హాజరుకాలేదు. నోటీసులను కూడా ఎన్ఐఏ టిడిపి నేత ఇంటికి అంటిచేసి వచ్చింది. అందరూ అనుకున్నట్లే చౌదరి ఎవరికీ కనబడకుండా మాయమైపోయారు. గడచిన వారం రోజులుగా పత్తాలేకుండా పోయారు. ఎన్ఐఏ కూడా చౌదరి కోసం విచారించింది. అయినా ఆచూకీ దొరకలేదు. చౌదరిని ఎలా విచారణకు రప్పించాలా అన్న విషయమై ఎన్ఐఏ ఆలోచిస్తోంది.
ఇటువంటి నేపధ్యంలో హఠాత్తుగా చౌదరి ఎన్ఐఏని కాంటాక్టు చేశారు. తనకు అనారోగ్యంగా ఉందని అందుకనే విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు చెప్పారు. అయితే, ఎన్ఐఏ తన ఇంటికి వస్తే అభ్యంతరం లేదని కూడా చెప్పటంతో ఎన్ఐఏ ఉన్నతాధికారులే గాజువాకలోని చౌదరి ఇంటికి వెళ్ళి విచారణ జరిపారు. దాదాపు రెండు గంటల పాటు విచారణ తర్వాత బయటకు వచ్చేశారు. అనారోగ్యం కుదుటపడిన తర్వాత ఎన్ఐఏ కార్యాలయానికి రావాల్సిందిగా చెప్పటంతో చౌదరి కూడా ఒప్పుకున్నారు.
మొత్తానికి ఎన్ఐఏ విచారణకు చౌదరి హాజరవ్వటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకంటే, హత్యాయత్నం ఘటన వెనుక ఉన్నదే చౌదరి అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చౌదరిని గనుక ఎన్ఐఏ విచారిస్తే అసలు సూత్రదారులు బయటకు వచ్చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే చౌదరి విచారణకు హాజరుకాకుండా అడ్రస్ లేకుండా పోయారు. దాంతో అందరి అనుమానాలు మరింత బలపడ్డాయి. విచారణకు హాజరుకాకుండా ఎన్ని రోజులు తప్పించుకోవాలో అర్ధం కావటం లేదట. టిడిపిలోని కీలక నేతలతో మాట్లాడిన తర్వాత, విచారణలో చెప్పాల్సిన విషయాలపై బ్రీఫింగ్ తీసుకున్న తర్వాతే చౌదరి ఎన్ఐఏను కాంటాక్టు చేసినట్లు సమాచారం.