వైసీపీలో చేరనున్న ఆ టీడీపీ కీలక నేత ఎవరు.?

మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ప్రత్యక్ష రాజకీయాలకు ఎప్పుడో దూరమయ్యారు. ఇటీవల ఆమె రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమ అభిమానులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశామనీ, ఏయే పార్టీల వైపు వుండాలో వాళ్ళ అభీష్టానికే వదిలేశామనీ చెప్పారామె.

గల్లా అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్, తెలుగుదేశం పార్టీ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అమరావతి ఉద్యమంలో కీలకంగా కనిపించిన గల్లా జయదేవ్ ఎందుకో ఈ మధ్య అంత యాక్టివ్‌గా కనిపించడంలేదు. కారణాలు ఏంటి.? అని ఆరా తీస్తే, అమర్‌రాజా భూముల వ్యవహారంలో అధికార వైసీపీ పెట్టిన ఇబ్బందులే కారణమన్నది ఓ వాదన.

ఇంతకీ గల్లా జయదేవ్ టీడీపీలోనే కొనసాగుతారా. ప్రస్తుతానికైతే గల్లా జయదేవ్ టీడీపీలోనే వున్నారు. ఔను, వున్నారంటే.. వున్నారంతే. కానీ, ఆయన టీడీపీలో యాక్టివ్‌గా లేకపోవడం పట్ల టీడీపీ నేతలు కొందరిలో అసహనం కనిపిస్తోంది. ఇది సహజంగానే గల్లా జయదేవ్‌లోనూ అసహనాన్ని పెంచుతుంది.

టీడీపీకి ప్రస్తుతం వున్నది ముగ్గురంటే ముగ్గురు లోక్ సభ సభ్యులు మాత్రమే. వారిలో కేశినేని నాని, టీడీపీలో వున్నారంటే వున్నారంతే. గల్లా జయదేవ్ పరిస్థితి కూడా అలాగే తయారయ్యింది. వచ్చే ఎన్నికల్లో గల్లా జయదేవ్ టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశాల్లేవంటున్నారు. ఆయన వైసీపీలోకి దూకేస్తారనే ప్రచారం జరుగుతోంది.

బీజేపీ వైపు కూడా గల్లా జయదేవ్ చూస్తున్నారన్నది ఓ హాటెస్ట్ గాసిప్.