పాత లెక్కలిస్తున్న ధైర్యం… ఆ రెండు జిల్లాలపై బాబు – పవన్ ఫోకస్!

వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ – జనసేన ప్రిపేర్ అయిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పొత్తు ప్రకటన, అనంతరం ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, మరోపక్క సమన్వయ కమిటీల సమావేశాలతో ఎలక్షన్ పనులు ప్రారంభించేశాయి టీడీపీ – జనసేన. ఈ సమయంలో ఈ రెండు పార్టీలూ గోదావరి జిల్లాలపైనే కీలకంగా దృష్టిసారించినట్లు తెలుస్తుంది. 2014 ఫలితాలు రిపీట్ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం!

అవును… వచ్చే ఎన్నికల వ్యూహాలపై టీడీపీ – జనసేన కసరత్తులు ప్రారంభించాయి. ఈ సమయంలో వైసీపీకి పట్టు ఉన్న ప్రాంతాల్లో ఏ విధంగా ముందకెళ్లాలి అనేది ఇప్పుడు వారి ముందున్న కీలక టాస్క్ గా ఉందని అంటున్నారు. అప్పటివరకూ టీడీపీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాలు ఉన్నపలంగా, ఊహించని స్థాయిలో వైసీపీకి అనుకూలంగా మారడంతో తగిలిన దెబ్బ నుంచి ఈ మధ్యే తేరుకున్నట్లు కనిపించిన పార్టీ… తాజాగా కలిసొచ్చిన జనసేన బలాన్ని మరింతగా ఉపయోగించుకుని ముందుకు వెళ్లాలని భావిస్తున్నాయి!

ఇందులో ప్రధానంగా వచ్చే ఎన్నికలలో అధికారం దక్కాలంటే గోదావరి జిల్లాలు కీలకమని బలంగా నమ్ముతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు ఉమ్మడి జిల్లాలపైనా ఈ రెండు పార్టీలూ ఫోకస్ పెట్టాయని తెలుస్తుంది. జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో ఉమ్మడి జెండా ఎగురవేసెందుకు, ఉమ్మడి అజెండాలను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో… టీడీపీ జనసేన 2019 ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకొని పనులు మొదలు పెట్టాయని అంటున్నారు.

వాస్తవానికి ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లోనూ టీడీపీకి గట్టి పట్టుంది. 2014 ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇందులో భాగంగా… 2014 ఎన్నికల్లో టీడీపీ (జనసేనతో కలిసి) పశ్చిమ గోదావరిలో క్లీన్ స్వీప్ చేసింది. ఇదే సమయంలో తూర్పు గోదావరి జిల్లాలో 12 స్థానాలను టీడీపీ గెలుచుకోగా… 5 వైసీపీ, 1 బీజేపీ, 1 ఇండిపెండెంట్ అభ్యర్ధి గెలుపొందారు. ఈ స్థాయిలో గోదావరి జిల్లాల్లో టీడీపీ హవా 2014 ఎన్నికల్లో నడిచింది.

అయితే 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి సీన్ రివర్స్ అయిపోయింది. అందులో భాగంగా… పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ కేవలం రెండు స్థానాలు పరిమితం అయింది. ఇక తూర్పు గోదావరిలో 4 స్థానాలు మాత్రమే టీడీపీ గెలుచుకోగా, జనసేన ఒక్క చోట గెలిచింది. మిగిలిన స్థానాలన్నీ వైసీపీ గెలుచుకుంది.

ఇక ఓట్ల శాతం విషయానికొస్తే… తూర్పు గోదావరి జిల్లాలో 2019 ఎన్నికల్లో టీడీపీకి 39.7 శాతం పోలవ్వగా.. వైసీపీకి 53.3 శాతం ఓట్లు దక్కడం గమనార్హం. జనసేన ఒకే సీటు గెలిచినా 14.84 శాతం ఓట్లు దక్కించుకుంది. ఇక వెస్ట్ గోదావరి జిల్లాలో వైసీపీ 13 స్థానాల్లో గెలిచి 46.35 శాతం ఓటింగ్ దక్కించుకోగా… టీడీపీ 2 సీట్లలో గెలిచి 36.30 ఓట్లు దక్కించుకుంది! ఇక జనసేనకు పశ్చిమలో సీట్లేమీ రాకపోయినా 11.68 శాతం ఓట్లు పోలయ్యాయి.

ఈ గణాంకాలను పరిగణలోకి తీసుకుంటున్న టీడీపీ – జనసేనలు కాస్త సామాజిక సమీకరణలను పక్కాగా అమలుచేసుకుంటే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడం పెద్ద కష్టం కాదని భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరోపక్క రాజకీయాల్లో 1 + 1 = 2 కాదని చెబుతూ… వారి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు! మరి రాబోయే ఎన్నికల్లో ఈ రెండు జిల్లాలూ ఎవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయనేది వేచి చూడాలి!