టీడీపీ, జనసేన గిల్లి కజ్జాలే వైసీపీకి బలం.!

సీట్ల పంపకాలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. రేపో మాపో ఎన్నికలకు నోటిఫికేషన్.. అంటూ ప్రచారం జరుగుతోందాయె.! అయినా, టీడీపీ – జనసేన మధ్య గిల్లికజ్జాలు ఆగడంలేదు. సోషల్ మీడియా వేదికగా జనసేన, టీడీపీ మధ్య సెటైర్ల పర్వం నడుస్తోంది. వేమన శతకాలు, సుమతీ శతకాలు.. వాట్ నాట్.. పద్యాలన్నీ దాదాపుగా అస్త్రాలుగా మారిపోయాయ్.. రెండు పార్టీల మధ్యా.

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల్ని ఏకపక్షంగా ప్రకటించేయడంతో మొదలైంది పెంట. దానికి కొనసాగింపుగా జనసేన అధినే తకూడా తమ అభ్యర్థులిద్దర్ని ప్రకటించడంతో.. ఆ పెంట కాస్తా ముదిరి పాకాన పడింది.

నిన్న మొన్నటిదాకా ‘పొత్తు ధర్మం పాటిస్తాం.. టీడీపీ – జనసేన కూటమి కోసం పనిచేస్తాం’ అని చెప్పుకున్న ఇరు పార్టీలకు చెందిన నెటిజన్లు, తమ పార్టీ విడాగా పోటీ చేయాలంటే, తమ పార్టీ విడిగా పోటీ చేయాలనే డిమాండ్లను తెరపైకి తెస్తున్నాయి.

జనసేన శ్రేణులు, టీడీపీని నానా రకాలుగా తూలనాడుతోంటే, టీడీపీ శ్రేణులు జనసేన మీద ఇంకా దారుణమైన దూషణలతో విరుచుకుపడుతున్నాయి.

ఇదే, వైసీపీకి కావాల్సింది.! టీడీపీ – జనసేన పొత్తు చెడితే, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి విజయం నల్లేరు మీద నడకే.! అంతెందుకు, వైనాట్ 175 అనే కోరిక కూడా వైసీపీకి తీరే అవకాశం వుంటుందేమో.!

అందుకే, టీడీపీ – జనసేన మధ్య నడుస్తున్న గిల్లికజ్జాల వ్యవహారానికి వైసీపీ మరింత ఆజ్యం పోస్తోంది. చిత్రంగా అటు చంద్రబాబుగానీ, ఇటు పవన్ కళ్యాణ్‌గానీ.. కలిసికట్టుగా ఓ సందేశం టీడీపీ, జనసేన శ్రేణులకు ఇవ్వలేకపోతున్నారు.