ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయ చైతన్యం కాస్త ఎక్కువని చెబుతుంటారు. ఎప్పుడు ఏ పార్టీ అధికారంలోకి రావడానికైనా… ఇక్కడ మెజారిటీ అనేది, వేవ్ అనేది కీ రోల్ పోషిస్తుందని అంటుంటారు. కాస్త వెనక్కి వెళ్తే… గతంలో జరిగిన దాదాపు అన్ని ఎన్నికలూ ఇదే విషయాన్ని స్పష్టం చేశాయని అంటారు. ఈ నేపథ్యంలో తన బలం, బలగం గోదావరి జిల్లాలే అని పవన్ ఇప్పటికే పలుమార్లు చెప్పకనే చెప్పిన పరిస్థితి.
అందులో భాగంగానే వారాహి యాత్రను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చెపట్టారు. ఆ జిల్లాలు మినహా మిగిలిన చోట మమా అనిపించేస్తున్నారనే చర్చ జరుగుతుంది. ఈ సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అవ్వడం.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం చకచకా జరిగిపోయాయి. దీంతో… టీడీపీతో పొత్తుపై అధికారిక ప్రకటన చేశారు పవన్ కల్యాణ్.
ఫలితంగా రెండు పార్టీలు ఉమ్మడి కార్యచరణ మొదలుపెడుతున్నాయి. ఇందులో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైల్ సమీపంలో… ఇరుపార్టీల సమన్వయ కమిటీలు భేటీ అయ్యాయి. రాజమండ్రిలోనే ఎందుకయ్యా అంటే… ఈ సమావేశం జరుగుతున్న హోటల్ కి రాజమండ్రి సెంట్రల్ జైల్ సమీపంలో ఉండటమే కాకుండా… చంద్రబాబుకి మనోధైర్యం కోసం అని చెబుతున్నారు!
ఇలా టీడీపీ నుంచి ఏడుగురు, జనసేన నుంచి ఏడుగురు సభ్యులతో సమావేశం జరిగింది. ఇందులో భాగంగా చంద్రబాబు అరెస్ట్ పై మూడు తీర్మానాలను ప్రతిపాదించారు! అనంతరం.. నవంబర్ 1 న ఉమ్మడి మేనిఫెస్టో విడుదల ఉంటుందని ప్రకటించారు. అంతవరకూ బాగానే ఉంది కానీ… రెండు పార్టీల్లోనూ మెజారిటీ నేతలు గోదావరిజిల్లా వారే కావడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.
అవును… టీడీపీ జనసేన తొలి సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న నేతల్లో అత్యధిక మంది గోదావరి జిల్లాలవారే కావడం విశేషం. అయితే… జనసేనకు ఆ జిల్లాల్లోనే ఎక్కువ పట్టుంది కాబట్టి అలా జరిగిందని అనుకోవచ్చు కానీ…టీడీపీ కూడా అదే బాటలో పయణించడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
సమన్వయ కమిటీలో జనసేన నుంచి హాజరైన ఏడుగురిలో… పవన్ కల్యాణ్, మనోహర్ మినహా మిగిలిన ఐదుగురిలో ముగ్గురు గోదావరి జిల్లా నేతలే. వీరిలో… ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, గత ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీ చేసిన బొమ్మిడి నాయకర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాధ్యుడు కందుల దుర్గేష్ సమన్వయ కమిటీలో ఉన్నారు.
ఇక టీడీపీ విషయానికొస్తే… నారా లోకేష్, అచ్చెన్నాయుడు మినహా మిగిలిన ఐదుగురిలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఆచంట మాజీ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఉమ్మడి తూర్పుగోదావరి నేత యనమల రామకృష్ణుడు సమన్వయ కమిటీ సభ్యులుగా ఉన్నారు. అంటే మొత్తంగా చూస్తే రెండు పార్టీల సమన్వయ కమిటీ సభ్యుల్లో ఎక్కువమంది గోదావరి జిల్లాల నేతలే ఉండటం గమనార్హం.
అలా అయినంత మాత్రాన్న చూడటానికి సమస్య కాదు కానీ.. రెండు పార్టీలూ హోప్స్ మొత్తం ఈ రెండు ఉమ్మడి జిల్లాలపైనే పెట్టుకుంటే సీట్ల సర్ధుబాట్లలో తలనొప్పులు తప్పవని అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి జనసేనకు గోదావరి జిల్లాల్లోనే పట్టు ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. అక్కడ టీడీపీకీ కూడా గట్టి పట్టే ఉంది.
ఇదే క్రమంలో… టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా గోదావరి జిల్లాల్లోనే ప్రభంజనం ప్రధానంగా సాగుతుంది. అంతవరకూ బాగానే ఉంది కానీ… రేపు సీట్ల విషయంలో రెండు పార్టీలకూ అక్కడే పీటముడి పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వేచి చూడాలి.. ఆ సమయానికి ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్నది!