ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన.. చెరిసగమేగానీ.!

2024 ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ ఖచ్చితమైన వ్యూహంతోనే మందడుగు వేస్తోంది మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ విషయంలో. ఎవరేమనుకున్నాసరే, టీడీపీతో పొత్తు పెట్టుకునే ఎన్నికల్లోకి వెళ్ళాలన్నది జనసేనాని పవన్ కళ్యాణ్ ఆలోచన. ఈ నిర్ణయాన్ని చాలా కాలం క్రిందటే జనసేనాని తీసుకున్నారు కూడా.

అంతకు ముందు టీడీపీ నుంచి జనసేనవైపుకి వలపు బాణాలు వెళ్ళడంతో, అక్కడినుంచే జనసేనాని ఖచ్చితమైన వ్యూహాల్ని అమలు చేస్తూ వచ్చారు. ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అని చెప్పిన జనసేనాని, జనసైనికుల్ని మానసికంగా సన్నద్ధం చేశారు టీడీపీతో పొత్తు విషయమై.

బీజేపీతో పొత్తులో వున్నాగానీ, బీజేపీ కంటే టీడీపీకే దగ్గరవుతూ వచ్చిన జనసేనాని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. చంద్రబాబు అరెస్టు, జనసేనానికి బాగా కలిసొచ్చింది. ఈ విషయంలో వైఎస్ జగన్‌కి పవన్ కళ్యాణ్ థ్యాంక్స్ చెప్పుకోవాలేమో.!

తెలంగాణలో టీడీపీ మద్దతుదారులు కొందరు, జనసేనకు వ్యతిరేకంగా నినదిస్తున్నా, పరిస్థితుల్ని జనసేనకు అనుకూలంగా పవన్ కళ్యాణ్ మార్చగలుగుతున్నారు. జనసేనకు నిన్న నందమూరి బాలకృష్ణ ‘జై’ కొట్టాక, ఈక్వేషన్ అనూహ్యంగా మారింది.

ఇక, 2024 ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో చెరి సగం సీట్లలో టీడీపీ – జనసేన పోటీ చేస్తాయన్నది పవన్ కళ్యాణ్ ఆలోచనగా కనిపిస్తోంది. ఆ దిశగానే టీడీపీ – జనసేన మధ్య సమన్వయ కమిటీ సమావేశాలు నియోజకవర్గాల వారీగా జరుగుతున్నాయి.

టీడీపీ నేతలు కొందరు ఇప్పటికైతే తమ సీట్లను త్యాగం చెయ్యడానికీ సిద్ధపడుతున్నారు. కానీ, టీడీపీ అనుకూల మీడియా అలాగే వైసీపీ అనుకూల మీడియా ఈ విషయమై చాలా ఇబ్బందిపడుతున్నాయి. అదే విచిత్రమైన రాజకీయం ఇక్కడ.!