‘పొత్తుల గురించి మాట్లాడటానికి చాలా సమయం వుంది. గ్రామ స్థాయి నుంచీ నివేదికలు తెప్పించుకున్న తర్వాతే, పొత్తులపై నిర్ణయం. ఈలోగా ఎవరూ మీడియా ముందర పొత్తుల గురించి మాట్లాడొద్దు. మాట్లాడితే చర్యలుంటాయ్ పార్టీ పరంగా..’ అంటూ పార్టీ శ్రేణులకు స్పష్టమైన హెచ్చరికలు జనసేనాని జారీ చేయడంపై, తెలుగుదేశం పార్టీలో ఆందోళన కనిపిస్తోంది.
‘ఓ పది పాతిక సీట్లు జనసేనకు ఇస్తే సరిపోతుంది.. అవీ అప్రాధాన్య సీట్లు ఇస్తాం.. తద్వారా పొత్తు మాకు కలిసొస్తుంది. జనసేన కూడా ఓ నాలుగైదు సీట్లు గెలుచుకునే అవకాశం వుంటుంది..’ అన్న భావనలో టీడీపీ ఇప్పటిదాకా వుంది.
‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను.. టీడీపీ – బీజేపీ – జనసేన కలిసి పోటీ చేస్తాయి..’ అని గతంలోనే జనసేనాని ప్రకటించారు. అలాంటప్పుడు, పొత్తుల గురించి జనసేనలో ఎవరూ మాట్లాడకూడదని జనసేనాని హెచ్చరిస్తే ఎలా.?
పొత్తుల విషయమై జనసేన – టీడీపీ మధ్యన పెద్ద యాగీనే జరుగుతోంది. ‘పది పాతిక కంటే ఎక్కువ సీట్లు దండగ..’ అని జనసేనపై టీడీపీ సెటైర్లేస్తోంది. దాన్ని జనసేన శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
మరోపక్క, టీడీపీ – జనసేన మధ్య వైరం, ఖచ్చితంగా వైసీపీకి లాభిస్తుంది. ఈ క్రమంలోనే ‘దమ్ముంటే ఒంటరిగా పోటీ చెయ్..’ అంటూ జనసేనకీ, టీడీపీకీ సవాల్ విసురుతోంది వైసీపీ. వైసీపీ కోరుకున్నట్టే, టీడీపీ – జనసేన మధ్య గ్యాప్ పెరుగుతోంది.
‘పొత్తు కాదు, అవగాహన మాత్రమే..’ అంటూ జనసేనాని కొత్త ప్రతిపాదన తెరపైకి తెస్తున్నారట. 60కి పైగా సీట్లలో పోటీ చేస్తామనీ, ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లు తమకే వదిలెయ్యాలని జనసేనాని కోరుతున్నారన్నది తాజా ఖబర్.! ఈ వ్యవహారంపై టీడీపీ గుస్సా అవుతోంది.