యర్రగొండపాలెం పట్టణంలోని పుల్లలచెరువు రోడ్డు నుండి చైతన్య నగర్ వైపు రోడ్డుపై వర్షం నీటి నిల్వ సమస్యను తెలుసుకున్న టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, ఎంపీడీఓ శ్రీనివాస్ గారు, పంచాయతీ కార్యదర్శి రామసుబ్బయ్య గారిని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. వెంటనే స్పందించిన ఎంపీడీఓ శ్రీనివాసులు గారు, పంచాయతీ కార్యదర్శి రామసుబ్బయ్య గారు ప్రత్యామ్నాయ మార్గంగా చైతన్య నగర్ నుండి రాళ్ళ వాగులోకి ప్రత్యామ్నాయ కాలువను తవ్వించారు. తద్వారా నీటి నిల్వ సమస్యకు పరిష్కారం అయింది. అదేవిధంగా చైతన్య నగర్ లో మురుగు కాలువలను శుభ్రం చేయించారు.
ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు గారు మాట్లాడుతూ – “ప్రజల సమస్యల పరిష్కారమే నా ప్రాధాన్యం. చిన్న సమస్యైనా పెద్ద సమస్యైనా వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం కోసం కృషి చేస్తాను. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడటం నా కర్తవ్యం” అని అన్నారు.
అలాగే ఆయన చైతన్య నగర్ వాసులకు హామీ ఇస్తూ – “భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు మళ్లీ రాకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులతో చర్చిస్తాను” అని స్పష్టం చేశారు.
ప్రాంత ప్రజలు మాట్లాడుతూ – “మా సమస్యను గుర్తించి వెంటనే స్పందించిన ఎరిక్షన్ బాబు గారికి, అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇలాంటి ప్రజా నాయకులు ఉండడం మా అదృష్టం” అని అభిప్రాయపడ్డారు.


