ఒకప్పుడు కృష్ణా జిల్లా టీడీపీకి కంచుకోటలా ఉండేది. కానీ గత ఎన్నికల్లో పరిస్థితి తలకిందులైంది. జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా కేవలం రెండు స్థానాలతో మాత్రమే సరిపెట్టుకుంది. ఈ ఫలితం మొత్తం రాష్ట్ర మెజారిటీ మీదే ప్రభావం చూపింది. జిల్లాలో టీడీపీ ఇంత ఘోరంగా ఓడిపోవడం నేతలను, పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న కొన్ని చోట్ల పార్టీ అభ్యర్థులు ఓడిపోవడం చంద్రబాబుకు సైతం షాకిచ్చింది. అలాంటి నియోజకవర్గాల్లో పెనమలూరు కూడ ఒకటి. విజయవాడకు అతి దగ్గర్లో ఉండే ఈ అసెంబ్లీలో టీడీపీ ప్రాభవం మొదటి నుండీ ఎక్కువే. కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ప్రాంతం ఇది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ ఓడిపోయారు.
2014లో టీడీపీ నుండి 30 వేల పైచిలుకు మెజారిటీతో గెలిచిన బోడె ప్రసాద్ ఈసారి 11 వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి పార్థసారథి చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ ఓటమికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి. అవి బోడె ప్రసాద్ స్వయంకృతాపరాధాలే. క్రితంసారి గెలిచినప్పుడు బోడె నియోజకవర్గంలోని శ్రేణులను కలుపుకుని వెళ్ళడంలో విఫలనయ్యారు. ఎవ్వరితోనూ తనకు అవసరం లేదన్నట్టు ఉండేవారు. చుట్టూ కొంతమందిని మాత్రమే పెట్టుకుని మిగతా వారిని పట్టించుకోలేదు. దీంతో కోపగించుకున్న తెలుగు తమ్ముళ్లు ఎన్నికల్లో ప్రతాపం చూపి ఆయన్ను ఓడగొట్టారు. తీరా ఓడిపోయాక చేసిన నిర్లక్ష్యం గుర్తుకొచ్చింది బోడె ప్రసాద్ కు.
అందుకే కొన్నాళ్లుగా నియోజకవర్గంలోని గ్రూపులను కలుపుకునిపోయే ప్రయత్నం చేస్తున్నారట. క్రితంసారి ఎవరినైతే దూరం పెట్టారో వారందరినీ విడతలవారీగా కలిసి మాట్లాడుతున్నారట. సమస్యలు తెలుసుకుంటున్నారట. పార్టీ బలోపేతానికి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకెళితే ప్రయోజనం ఉంటుంది లాంటి చర్చలు జరుపుతున్నారట. తాజాగా చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నప్పుడు జిల్లా నేతలు, స్థానిక నాయకులు బోడె ప్రసాద్ వైఖరిలో వచ్చిన ఈ మార్పును ప్రముఖంగా ప్రస్తావించారట. దీంతో చంద్రబాబు సైతం సంతృప్తి చెందారని, ఇలాగే కలిసికట్టుగా ఉంటే వచ్చే ఎన్నికల్లో పుంజుకోవడం ఖాయమని అన్నారట.