గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 23 అసెంబ్లీ సీట్లతో సరిపెట్టుకుంది. విఐపీ 151 స్థానాలతో భారీ విజయాన్ని సాధించింది. ఈ ఫలితాలు చూసి జనమంతా టీడీపీ దారుణాతి దారుణంగా ఓడిందని, ఇక ఆ పార్టీకి రాష్ట్రంలో నూకలు చెల్లాయని అభిప్రాయపడుతున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉంది. టీడీపీ 23 స్థానాలే గెలిచినా వారికి వైసీపీకి మధ్యన ఓట్ షేర్ వ్యత్యాసం 10 నుండి 11 శాతం మాత్రం. ఈ కొద్దిపాటి తేడాకే 128 అసెంబ్లీ స్థానాల తేడా వచ్చేసింది. చాలా స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు 1000 లేదా వందల ఓట్ల తేడాతో ఓడిపోయారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు కేవలం 25 ఓట్ల తేడాతో ఓటమి చెందాల్సి వచ్చింది. ఇలా వెంట్రుకవాసి తేడాతో ఎమ్మెల్యే స్థానాన్ని కోల్పోవడంతో బొండా బాగా డిసప్పాయింట్ అయ్యారు. సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ శ్రేణులు సైతం అరెరే ఇంకొంచెం గట్టిగా పనిచేసి ఉంటే ఉమా గెలిచేవారే కాగా అని నిరుత్సాహపడ్డారు.
ఉమామహేశ్వరరావు లాంటి ఎఫిషియంట్ వ్యక్తి అసెంబ్లీలో లేకపోవడం టీడీపీకి పెద్ద నష్టమే అనాలి. ఎందుకంటే ఉమామహేశ్వరరావు టీడీపీలో ఉన్న అతికొద్దిమంది హేతుబద్దమైన వాదం వినిపించే నేతల్లో ఒకరు. ఏ విషయం మీదనైనా సమగ్ర పరిశీలన చేసి ప్రత్యర్థిని ఇరకాటంలో పెట్టడంలో ఉమా దిట్ట. ఆయన మైక్ అందుకుంటే ఆపొనెంట్స్ అప్రమత్తమవాల్సిందే. ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ నేతలు బొండా దాటికి నిలవలేకపోయారు, టీడీపీ మీద వైసీపీ నేతలు ఒక ప్రశ్న వేస్తే ఎదురు ఉమా నుండి పది ప్రశ్నలు లేచేవి. అలా అసెంబ్లీలో గడగలాడించిన వాయిస్ ఇప్పుడు లేకపోవడంతో చంద్రబాబు నాయుడుకు ఆ లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఉమా సైతం చిత్రమైన ఓటమిని ఎలా తీసుకోవాలో తెలీక ఇబ్బందిపడి కొన్నాళ్ళు సైలెంట్ అయ్యారు.
ఆయన అలా మౌనం పాటించడం చంద్రబాబుకు నచ్చలేదు. తిరిగి యాక్టివ్ చేయాలనే ఉద్దేశ్యంతో సీనియర్ నాయకులకు ఇచ్చే పొలిటి బ్యూరో సభ్యత్వాన్ని ఆయనకు ఇచ్చారు. ఆ ప్రోత్సాహంతో బొండా కొంచెం యాక్టివ్ అయ్యారు. ఇల్లా స్థలాల పంపిణీ విషయంలో అధికార పార్టీని ఇరుకునపెట్టేలా వాదన వినిపించారు. సీనియర్ నేత, ఎమ్మెల్యే మద్దాలి విష్ణు కూడ బొండా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. అది చూసి పర్వాలేదు తేరుకున్నారని అనుకునేలోపు మళ్ళీ సైలెంట్ అయిపోయారు ఉమా. ఎప్పుడో కానీ మైక్ అందుకోవట్లేదు. ప్రధాన విషయాలు మీద వాయిస్ వినిపించట్లేదు. ఇదే విజయవాడ టీడీపీ శ్రేణులకు ఇబ్బందిని కలిగిస్తోంది. పొలిట్ బ్యూరో సభ్యత్వం ఇచ్చి మరీ ప్రోత్సహించినా ఉమా అలాగే ఓటమి నైరాశ్యంలో ఉండటం చంద్రబాబును కూడ ఇబ్బందిపెడుతోంది. మరి ఈ పరిస్థితిని గమనించి ఉమా మునుపటిలా యాక్టివ్ అయితే పార్టీతో పాటు ఆయనకు కూడ మంచిది.