ఇంజనీరింగ్ చదవాలంటే బైసీపీ పూర్తి చేయడమేంటి.? ఏదో పొరపాటున చంద్రబాబు అలా అనేసి వుంటారు. వృద్ధాప్యం వల్ల కావొచ్చు, ఏదో కంగారులో కావొచ్చు.. చంద్రబాబు అలా అనేసి వుంటారు. దాన్ని అంతలా బూతద్దంలో చూడాల్సిన పనిలేదు కూడా.
బీకాం ఫిజిక్స్.. వంటి కామెడీలు రాజకీయాల్లో చాలా చూశాం. వయసు మీద పడ్డాక.. చిన్నా చితకా పొరపాట్లు ఏ రాజకీయ నాయకుడికైనా సహజమే.
ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన బైపీసీ ఇంజనీరింగ్ వ్యాఖ్యలపై దుమారం తారా స్థాయికి చేరడంతో, డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగింది టీడీపీ సోషల్ మీడియా విభాగం. దాంతో, రచ్చ మరో లెవల్‌కి వెళ్ళింది.
జరిగిన పొరపాటుకి లైట్ తీసుకుంటే పోయేది. కానీ, వివరణలతో కూడిన విమర్శలు.. టీడీపీ ఇమేజ్‌ని మరింత డ్యామేజ్ చేస్తున్నాయి. బైపీసీ చేస్తే బయో టెక్నాలజీ ఇంజనీరింగ్ చేయొచ్చు తెలుసా.? అంటూ దీర్ఘాలు తీస్తున్నారు టీడీపీ నెటిజన్లు. దానికి కౌంటర్ ఎటాక్స్ కూడా గట్టిగానే పడుతున్నాయి.
రాజకీయాల్లో మాటకి మాట మామూలే. ఇది సోషల్ మీడియా యుగం. ఆ మాటకి మాట చాలా చాలా గట్టిగా పడిపోతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగాల్లో చిన్నా చితకా తప్పులు దొర్లితే. వాటిని టీడీపీ గట్టిగా పట్టుకుని వేలాడుతోంది.. నానా యాగీ చేస్తోంది.
అందుకేనేమో, వైసీపీ కూడా గట్టిగానే కౌంటర్ ఎటాక్ ఇస్తోంది టీడీపీకి. చంద్రబాబు స్పందించి పొరపాటు జరిగిందని చెప్పాల్సిన పనిలేదు. ఈ వ్యవహారంపై టీడీపీ లైట్ తీసుకుంటే సరిపోయేది. పోనీ, పార్టీ తరఫున అధికార ప్రతినిథులెవరో ఒకరు వచ్చి, అదేదో పొరపాటులో జరిగిందని వివరణ ఇచ్చినా వివాదం ఇక్కడితో ముగిసేది.
తెగే దాకా లాగితే.. పోయేది టీడీపీ అధినేత చంద్రబాబు పరువే.!