తిరుపతి ఉపఎన్నికపై తెలుగుదేశం పార్టీ పూర్తి దృష్టి కేంద్రీకరించింది. బై పోల్ లో గెలుపు ద్వారా అధికార వైసీపీకి షాకివ్వాలని ప్రణాళికలు వేస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు స్థానిక నేతలకు పిలుపునిచ్చారు. తిరుపతి నేతలతో సమీక్ష జరిపిన చంద్రబాబు ఈ ఎన్నిక ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరుపతి ఉపఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.వైసిపిని ఓడించడం ద్వారా చారిత్రాత్మకమైన తీర్పుకు తిరుపతి వేదిక కావాలి. దేశానికే ఒక సందేశాన్ని తిరుపతి ప్రజలు పంపాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఇదే స్ఫూర్తితో జనవరి 21నుంచి 10రోజుల పాటు, 700 గ్రామాల్లో ప్రచారం ఉధృతం చేయాలి. టీడీపీ పాలనలో చేసిన అభివృద్ది, సంక్షేమాన్ని ప్రజలకు గుర్తు చేయాలి. వైసిపి వచ్చాక పెరిగిన దాడులు, విధ్వంసాలు, పన్నుల భారాలు, చేసిన అప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ హయాంలో చిత్తూరు జిల్లాలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. హార్డ్ వేర్ హబ్ గా, మొబైల్ ఫోన్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా తిరుపతిని చేశామని., చిత్తూరు జిల్లాలో రూ లక్ష కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేసి 95వేల మందికి ఉపాధి కల్పించామని చెప్పారు.
తిరుపతి, శ్రీసిటి, కృష్ణపట్నంలను ట్రైసిటిగా అభివృద్ది చేస్తే, వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలను తరిమేస్తోందని ఆరోపిచారు. వైసిపి వచ్చాక ఒక్క కంపెనీ తేకపోగా ఉన్న అమర రాజా ఇన్ ఫ్రాటెక్ భూములు రద్దుచేశారాన్నారు. టిడిపి హయాంలో తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడాం, అన్నదానం, ప్రాణదానం ట్రస్ట్ లు ఏర్పాటు చేస్తే, ఈ ప్రభుత్వం తిరుమల తిరుపతి పవిత్రతకే కళంకం తెచ్చిందని ఆరోపణలు చేశారు.