వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడేనని డిసైడ్ చేసేశారు తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు విశ్వసించడంలేదనీ, ‘ఒక్క ఛాన్స్..’ అంటూ గద్దెనక్కి ప్రజల్ని వైఎస్ జగన్ వంచించారనీ చంద్రబాబు విమర్శిస్తున్నారు.
‘క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్..’ అంటూ నినదిస్తోన్న తెలుగుదేశం పార్టీ, వచ్చే ఎన్నికల్లో ఏకపక్ష విజయాన్ని అందుకుంటుందనేది ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఉవాచ.
అయితే, టీడీపీ అట్టహాసంగా నిర్వహించిన మహానాడు సందడి ముగిసిన మర్నాడే, టీడీపీకి గుడ్ బై చెప్పేయాలనుకున్నారు ఆ పార్టీ అధికార ప్రతినిథి, మహిళా నేత, సినీ నటి దివ్య వాణి. ‘నేను చచ్చిపోయాక.. నా శవాన్ని చూపించి ఓట్లు దండుకుంటారా.?’ అని ఆమె ప్రశ్నించిన వైనం, సోషల్ మీడియాలో కాక రేపుతోంది.
టీడీపీలో నేతల పరిస్థితి ఎలా వుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ‘మూడు సార్లు వరుసగా ఓడినవారికి టిక్కెట్లు ఇవ్వకూడదనే ఆలోచన వుంది..’ అంటూ నారా లోకేష్ పేల్చిన బాంబుతో చాలామంది సీనియర్లు, టీడీపీలో కొనసాగడం గురించి ఆలోచనలో పడిపోయారట.
పరిస్థితి ఇంత తీవ్రంగా వుంటే, చంద్రబాబు మాత్రం, వచ్చే ఎన్నికల్లో ఏకపక్ష విజయం టీడీపీ సాధించేస్తుందని చెబుతున్నారు. ఎలా.? చంద్రబాబు అతి విశ్వాసానికి కారణమేంటి.? ఏమో, జనం అనుకుంటే టీడీపీకి ఏపక్ష విజయాన్ని అందించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ, అందుకు తగ్గ సానుకూల పరిస్థితులు టీడీపీకి వున్నాయా.? అన్నదే అసలు ప్రశ్న.