టీ కప్పులో తుపానులా బెజవాడ తెలుగు తమ్ముళ్ళ మధ్య గొడవ చాలా తక్కువ సమయంలోనే చల్లారిపోయింది. టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి, పరిస్థితిని చక్కదిద్దారు. లేకపోతే, బుద్ధా వెంకన్న.. మాటకు కట్టుబడి కేశినేని నాని మీద దాడికి దిగేవాడేమో.! బొండా ఉమామహేశ్వరరావు, నాగుల్ మీరాతో కలిసి బుద్ధా వెంకన్న.. బెజవాడ టీడీపీలో పెను ప్రకంపనలు సృష్టించిన విషయం విదితమే. ఎంపీ కేశినేని నాని మీద విరుచుకుపడిపోయారు పై ముగ్గురు నేతలు. కానీ, కేశినేని నాని కుమార్తె సమయస్ఫూర్తి ప్రదర్శించారు. తప్పదు, అవసరం ఆమెది. బెజవాడ మేయర్ అభ్యర్థి అయిన కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత.. చంద్రబాబు ఆదేశాలతో బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావు, నాగుల్ మీరాలను కలిశారు. ‘కలిసి పనిచేద్దాం..’ అని కోరారు. ‘అబ్బెబ్బే, కోపం మీ మీద కాదు.. మీ నాన్న మీద.. మీతో కలిసి పనిచేస్తాం.. ఎందుకంటే, చంద్రబాబు మీ పేరు ఖరారు చేశారు బెజవాడ మేయర్ పదవి కోసం..’ అంటూ పై ముగ్గురు టీడీపీ నేతలూ సర్దుకుపోయారు.
మరోపక్క, కేశినేని నాని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే, కుమార్తెను రాయబారానికి పంపారనీ, ఈ క్రమంలో తెరవెనుకాల పెద్ద కథే నడిచిందంటూ బెజవాడ టీడీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తమ్మీద, బెజవాడ టీడీపీలో ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగింది. చంద్రబాబు పర్యటనకు లైన్ క్లియర్ అయ్యింది. అందరం కలిసే చంద్రబాబు పర్యటనలో పాల్గొంటామని, బెజవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకుంటామని బెజవాడ టీడీపీ నేతలు సెలవిస్తున్నారు. ఈ సోయ ఏదో ముందే వుంటే బావుండేది కదా.. ఇప్పుడు డ్యామేజీ జరిగిపోయాక సఖ్యత కుదిరితే ఏం లాభం.? అన్నది స్థానికంగా టీడీపీ కార్యకర్తల నుంచి వినిపిస్తోన్న అభిప్రాయం. వ్రతం చెడితే తప్ప, విధానం తెలియదన్నట్టు తయారైంది