వారంట్ మోదీ కుట్ర: టిడిపి ఎదురుదాడి

 ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడికి  మహారాష్ట్ర కోర్టొకటి పంపిన నాన్ బెయిలబుల్ వారంట్ నుంచి తెలివిగా రాజకీయ లబ్ది పొందేందుకు తెలుగుదేశం పార్టీ  అపుడే కృషి మొదలుపెట్టింది.

ఇది టిడిపి అధినేత మీద ప్రధాని  కక్ష సాధింపు చర్యఅని ప్రచారం మొదలుపెట్టింది.  మోదీయే ఈ వారంట్ ఇప్పించాడని ప్రచారం మొదలుపెట్టింది.  ఈ వారంట్ పేరుతో మోదీని తెలుగు ప్రజల మధ్య ఇంకా అపకీర్తి పాలు చేసేందుకు టిడిపి నేతలు ప్రచారం  మొదలుపెట్టారు. తెలుగురాష్ట్రానికి  మోదీ  ద్రోహం చేశారని  ఇప్పటికే బాగా ప్రచారం చేస్తున్నటిడిపికి ఇపుడు  మహారాష్ట్ర కోర్టు మరొక అస్త్రం అందించింది.

తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకోసం పోరాడినందుకు ఇపుడు ఆయనను అవమాన పరుస్తున్నందున రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఇపుడు చంద్రబాబు కు అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీ పిలుపు నిచ్చింది.

రాత్రి పొద్దు పోయాక  పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వారంట్ మీద స్పందిస్తూ ఇదంతా ప్రధాని  చేస్తున్న కుట్రలో భాగమేనని అన్నారు.

‘తెలుగువారు ప్రాంతాలకతీతంగా ఏకం కావాల్సిన సమయం వచ్చింది. తెలంగాణ ముఖ్య మంత్రి 
కేసీఆర్ కూడా స్పందించాలి. చంద్రబాబు ఆనాడు పోరాటం చేసింది ఉత్తర తెలంగాణ క్షేమం కోసమే అని తెలంగాణ ప్రజలు గమనించాలి,’ అని ఆయన పిలుపు నిచ్చారు.

 ’ఎపుడో 2010 లో జరిగిన ఒక చిన్న సంఘటన ఆధారం చేసుకుని ఎనిమిదేళ్ల తరువాత  కనీసం ముందస్తు నోటీసు కూడా లేకుండా ఇలా నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చిందంటే దానిని ఎలా అర్థం చేసుకోవాలి. ప్రధానిగా తానేమి చేసినా చెల్లు తుందని మోది విర్రవీగుతున్నాడు.ఎంతోమందిని ప్రధానమంత్రులుగా చేసిన ఘనత చంద్రబాబుది,’ పార్టీ  ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కత్తులు నూరుతున్నారు.  

‘ప్రధాని అంటే అందరినీ ఒకేలా చూడాలి, కానీ మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారు. 2014 లో ప్రధాని పదవి కోసం కడుపులో కత్తులు పెట్టుకుని చంద్రబాబు ను కౌగలించుకున్నారు. ఇప్పుడు అవసరం తీరిపోయాక ఇలా వేధిస్తున్నారు.  ఆపరేషన్ గరుడ ప్రారంభించినట్టు వార్తలు వస్తే ముందు మేమూ కొట్టి పారేసాం. కానీ ఇప్పుడు అవే నిజాలు అని తెలుస్తున్నాయి,’ అని ఆయన అన్నారు.

‘2010 లో చంద్రబాబును మూడు రోజుల పాటు కనీసం బాత్రూం కూడా లేని గదిలో దాదాపు బందీగా ఉంచినా సరే వీరోచితంగా పోరాడారు.బాబ్లీ ప్రాజెక్ట్ ఎత్తు పెంచడం వల్ల ఏపీకి అన్యాయం జరుగుతుందని పోరాడారు.తెలుగు ప్రజలే ముఖ్యం అని చంద్రబాబు ఇక్కడే ఉన్నారు గానీ ఆయన కోరుకొని ఉంటే ఎప్పుడో ప్రధాని అయ్యుండేవారు,’  బుధ్దావెంకన్న 

‘చంద్రబాబు జోలికి వస్తే నిరసనల్లో క్రొత్త వరవడి సృష్టిస్తాం. హింసాత్మక మార్గం మాది కాదు.మోడీ సినిమా అయిపోయింది.మోడీ లాంటోళ్ళు వస్తుంటారు ..పోతుంటారు.చంద్రబాబు చిరంజీవి,’ అని బుద్దా వెంకన్న అన్నారు .

నోటుకు వోటు కేసు వచ్చి చంద్రబాబును ఇరుకున పెట్టవచని అనుకుంటున్నపుడు ఆయన్ని హీరోని చేస్తూ వచ్చిన వారంట్ ని ఒక రాజకీయ అవకాశంగా మార్చుకోవాలని తెలుగుదేశం నేతలందరికి సూచనలు కూడా వెళ్లాయి.  ఎవరి స్థాయిలో  వారు నిరసన ప్రదర్శనలు, ప్రకటనలు చేయాలని అంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలోని పార్టీ నేతలకు పిలుపు నిచ్చారు.