ప్రస్తుతం ఏపీలోని ప్రధాన పార్టీల దృష్టి మొత్తం తిరుపతి ఉప ఎన్నికల మీదే ఉంది. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నా పార్టీలన్నీ ఇప్పటి నుంచే సంసిద్దమవుతున్నాయి. ఎవరికివారు సొంత వ్యూహాలు పన్నుకుంటున్నారు. 2019 ఎన్నికల తరవాత మొదటిసారి జరగనున్న ఎన్నికలు కావడంతో అందరూ తీవ్రంగా కృషి చేస్తున్నారు. వారిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొద్దిగా ముందే ఉన్నారు. ఇప్పటికే అభ్యర్థిగా పనబాక లక్ష్మిని ప్రకటించిన ఆయన జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఈ లోక్ సభ ఉపఎన్నికలు చంద్రబాబు స్థాయికి పెద్దవేమీ కాదు. పలు సార్వత్రిక ఎన్నికలను చూసిన పార్టీని నడిపిన అనుభవం ఆయనది. అలాంటి నాయకుడికి తిరుపతి బై ఎలక్షన్లు పెద్ద లెక్క కాదు. ప్రతికూల పరిస్థితులను కూడ అనుకూలంగా మార్చుకోవడంలో ఆయన దిట్ట. పైగా తిరుపతి అనేది చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనే ఉంది.
కాబట్టి ఈ ఎన్నికలు ఆయనకు ప్రతిష్టాత్మకంగా మారాయి. చంద్రబాబు నాయుడు, ఇతర టీడీపీ నేతలు నోరుతెరిస్తే జగన్ పాలన మీద తీవ్ర అసంతృప్తి ఉందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే జగన్ ఓడిపోవడం ఖాయమని చెబుతున్నారు. పైపెచ్చు అమరావతిని రెఫరెండంగా తీసుకుని రాజీనామాలు చేసి ఎన్నికలకు రమ్మని ఛాలెంజ్ చేశారు. అయితే ముందు తిరుపతి ఎన్నికల్లో తేల్చుకోమని అంటున్నారు వైసీపీ నేతలు. అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు బాబుగారు. కానీ రియాలిటీలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. లోక్ సభ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలంతా వైసీపీ ఎమ్మెల్యేలే. ఓడిన టీడీపీ నేతల ప్రాభల్యం కూడ తగ్గింది. పైపెచ్చు జగన్ కు అత్యంత సన్నిహితుడు వైవీ సుబ్బారెడ్డి తిరుపతి ఎన్నికల బాధ్యతను తీసుకుంటారనే టాక్ ఉంది.
ఎలాగూసిట్టింగ్ స్థానమే కాబట్టి సానుభూతి అంశం కూడ పనిచేసే అవకాశం ఉంది. ఇన్ని ప్రతికూలతలు ఉన్నాయి టీడీపీకి. అందుకే బాబుగారు పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న రాబిన్ శర్మను రంగంలోకి దింపారు. ఇప్పటికే తిరుపతిలో మకాం వేసిన రాబిన్ శర్మ అనుకూలతలు, ప్రతికూలతలు, వైసీపీ బలహీనతల మీద ఫోకస్ పెట్టారు. టీడీపీ స్థానిక నేతలతో వరుస మీటింగ్లు పెట్టుకుని సమాచారం సేకరిస్తున్నారు. పరిస్థితి చూస్తే గెలుపు బాధ్యత మొత్తాన్ని ఆయన మీదే వేసినట్టు కనబడుతోంది. ఇలా కేవలం ఒక లోక్ సభ స్థానానికే చంద్రబాబు ఇలా ఎన్నికల స్ట్రాటజిస్టును రంగంలోకి దింపడం మరీ విపరీతంగా ఉంది. ఈ చర్య ఒకరకంగా తన మీద, నాయకుల మీద తనకే తనకే నమ్మకం లేదని చంద్రబాబు పరోక్షంగా చెప్పినట్టు ఉంది.
టీడీపీ శ్రేణులైతే ఒక ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల కోసం చివరికి పక్క రాష్ట్రం వ్యక్తి మీద ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడిందని తలపట్టుకుంటున్నారు. ఈ పరిణామంతోనే సగం ఆత్మవిశ్వాసం నీరుగారిందని, పార్టీని గెలిపించుకోవడం మా వల్ల కాదని చేతులెత్తేసినట్టు ఉందని దానికి బదులు చంద్రబాబు నాయుడే నేరుగా రంగంలోకి దిగి వైసీపీని ఢీకొట్టి ఉంటే గెలవకపోయినా పోరాడారని పరువైనా దక్కతుందని భావిస్తున్నారు.