ఎల్లో సిగ్నల్: జనసేనకు చావుకబురు చల్లగా!

రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన పొత్తు ఉంటుందా అంటే ఎవరూ క్లియర్ గా చెప్పలేరు. అది జనసైనికులైనా, జనసేన నేతలైనా, టీడీపీ నేతలైనా.. ఆఖరికి విశ్లేషకులైనా! ఎందుకంటే… ఆ విషయం పవన్ కల్యాణ్ కే ఇంకా తెలియదు! ఆ విషయంలో క్లారిటీ ఉన్నది ఒక్క చంద్రబాబుకి మాత్రమే. అది ఆయన నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం… ఎన్నికలు దగ్గరైన తర్వాత డెసిషన్ ఉంటుంది!

ప్రశ్నించడానికి పార్టీ పెట్టి చేయకూడనన్ని వ్యూహాత్మక తప్పిదాలు చేసిన జనసేన అధినేత… మరో తప్పుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. తప్పంటే… పొత్తు పెట్టుకోవడమో – పొత్తు పెట్టుకోకపోవడమో కాదు! ఎవరితో పొత్తుకొనడం, ఎప్పుడు పొత్తుకోవడం అనే విషయంలో స్పష్టత లేకుండా ప్రయాణించడం! పైగా… “తనతో ప్రయాణించేవాడే తనవాడు.. తనను సంకించేవాడు తనవాడు కాదని”.. ప్రశ్నించే కార్యకర్తల గొంతును బ్లాక్ మెయిల్ చేయడం!

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉంది. అది కూడా ముందస్తుకు రావాలనే ఆలోచన జగన్ చేయనిపక్షంలో! దీంతో… ఇప్పటికే పార్టీ పనులు, అభ్యర్థుల ఎంపికలు, కేడర్ ను ఉత్సాహ పరుస్తూ దిశానిర్ధేశం చేసే మీటింగులతో బాబు బిజీగా ఉన్నారు. ఇక వైసీపీ కూడా ఎన్నికల పనులు తెరవెనుక చక్కబెట్టేసుకుంటుంది. కానీ.. పవన్ మాత్రం ఇప్పటికీ కేడర్ ను సంకటంలో పాడేసి ఉంచారు!

పొత్తు ఉంటే… ఏ సీటు మనది.. ఏ సీటు పొత్తులోది వంటి విషయాలు ఇప్పటికీ క్లారిటీ ఇవ్వడం లేదు. బాబు మాత్రం పొత్తులో భాగంగా తనకు తాను ఫిక్స్ చేసుకున్న కొన్ని స్థానాలకు మినహా… మిగిలిన అని స్థానాలకు అభ్యర్థులను ఆల్ మోస్ట్ ఫైనల్ చేసేశారు.. అది కూడా ప్రైవేట్ గా!

అయితే ఇంతకాలం పవన్ కి ఒక హోప్ ఉండేది. టీడీపీ పొలిట్‌ బ్యూరో స‌మావేశంలో పొత్తుల‌పై క్లారిటీ వ‌స్తుంద‌నే ప్రచారం జ‌రగడంతో… ఆరోజు ఫైనల్ అయిపోతుందని పవన్ భావించారు. అయితే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చావు క‌బురు చల్లగా చెప్పారు. స‌మావేశంలో పొత్తుల గురించి చ‌ర్చించ‌లేద‌ని స్పష్టం చేస్తూ… ఎన్నిక‌ల స‌మ‌యంలో మాత్రమే పొత్తుల‌పై మాట్లాడ్తామన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో క‌లిసొచ్చే పార్టీల‌తో పొత్తుల విష‌య‌మై ఆలోచిస్తామ‌ని చెప్పారు.

ఈ ప‌రిణామాల్ని జ‌న‌సేన జీర్ణించుకోలేక‌పోతోంది. ఎన్నికల సమయంలో అంటే… ఇంకో రెండు నెలల్లో ఎన్నికలు అనగా.. అప్పటి పరిస్థితులను బట్టి పొత్తుకు గ్రీన్ సిగ్నలో – రెడ్ సిగ్నలో వేస్తారన్నమాట. మరి ఆ లోపు జనసేన ఏమిచేయాలి? ఎందుకంటే… జ‌న‌సేనాని ప‌వ‌న్‌ క‌ల్యాణ్ త‌న పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డం మాని, టీడీపీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ప‌లుమార్లు టీడీపీతో పొత్తు కోసం నేరుగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా… అటు వైపు నుంచి గ్రీన్ – రెడ్ కాకుండా ఎల్లో సిగ్నల్ క‌నిపిస్తోంది. ఆ ఎల్లో సిగ్నల్… రెడ్ తర్వాత “ముందుకు కదలడానికి రెడీగా ఉండండి” అని చెప్పేదా? లేక, గ్రీన్ తర్వాత “ఆగండి – కదలొద్దు” అని అర్ధం చెప్పేదో అర్ధం కాక… దిక్కులు చూడాల్సిన పరిస్థితి జనసేనానిది. ఇలా చివ‌రి వ‌ర‌కూ నాన్చివేత దోరణి ప్రదర్శిస్తే… భారీగా నష్టపోతామనే ఆందోళ‌న జ‌న‌సేన నేత‌లది.

మరి బాబు అనుసరిస్తున్న ఈ పొత్తు వ్యూహాల్లో జనసేన బలవుతుందా.. చివర్లో గత్యంతరం లేక.. పదికో పాతికకో ఒప్పుకుని సర్ధుకుపోతుందా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా… నిర్ణయాలు తీసుకునే శక్తి లేనప్పుడు పవన్ సొంత పార్టీ పెట్టుకోవడం ఎందుకు? రోడ్ మ్యాప్ ఏమో బీజేపీని అడిగి – పోటీ ఒంటరిగా చేయాలా, కలిసి చేయాలా అనేది బాబుని అడిగి… ఏమి సాదిద్దామని – ఎలా సాదిద్దామని? అంటూ విసిగిన మనసుతో దీనంగా ప్రశ్నిస్తున్నారు జనసైనికులు!