తెలుగుదేశం పార్టీతో కొందరు వైసీపీ నేతలు టచ్‌లో వున్నారంటూ, వైసీపీ నేతలే చెబుతన్నారు. ఇదో చిత్ర విచిత్రమైన పరిస్థితి. ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో రాజకీయ నాయకుల అసలు రంగులు బయటపడుతున్నాయి. వైసీపీలో వుంటూ టీడీపీతో సంబంధాల్ని తెరవెనుక నడుపుతున్న నేతల బాగోతాలు మరింతగా బయటపడే రోజెంతో దూరంలో లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
అలాంటి కోవర్టుల్ని ఇప్పటికే ఎక్కడ వుంచాలో అక్కడ వుంచేలా వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారనే వాదన కూడా వైసీపీలో వినిపిస్తుండడం గమనార్హం. అయినాగానీ, నిన్న మొన్నటిదాకా వైఎస్ జగన్‌కి నమ్మిన బంటుల్లా వ్యవహరించిన కొందరు, ఇప్పుడు టీడీపీకి ‘విలువైన సమాచారం’ చేరవేస్తున్నారట.
‘టీడీపీ తమ కోవర్టుల్ని యాక్టివేట్ చేసింది..’ అంంటూ వైసీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చతో, ఎవరా కోవర్టులు.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది. ఉత్తరాంధ్రలో ముగ్గురు వైసీపీ కీలక నేతలు, వైసీపీ పుట్టి ముంచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారట. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ పరిస్థితి ఇంకా దారుణంగా వుందని అంటున్నారు.
రాయలసీమలోనూ కొంతమంది కోవర్టులున్నా, ఆ సంఖ్య తక్కువేనంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మళ్ళీ వైసీపీకి, టీడీపీ కోవర్టుల బెడద ఎక్కువగానే వుందట. వీరిలో కొందరు ప్రస్తుత మంత్రులు, కొందరు మాజీ మంత్రులు వున్నారంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు గుప్పుమంటున్నాయి.
అయితే, ఇదంతా టీడీపీ అనుకూల మీడియా కుట్ర.. అంటూ వైసీపీ నేతలు బాహాటంగా ఖండిస్తుండడం గమనార్హం.