రాజకీయాల్లో రాణించాలనుకున్నాడు.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు. ఇంతలోనే విధి వెక్కించింది. నందమూరి తారక రత్న గుండె పోటుతో ప్రాణాలు కోల్పోవడంపై సర్వత్రా వినిపిస్తోన్న వాదన ఇది. గత కొన్నాళ్ళుగా తారక రత్న, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
టీడీపీ నుంచి తాను పోటీ చేయనున్నట్లు తారకరత్న ప్రకటించేశాడు కూడా. చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్నది తారకరత్న ఆలోచన. ఈ క్రమంలోనే తారకరత్న రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించాడు.. స్థానిక టీడీపీ నేతలతో మంతనాలు జరిపాడు. రాయలసీమకీ వెళ్ళాడు.. అక్కడా, కొన్ని నియోజకవర్గాల్లో తిరిగాడు. పరిటాల కుటుంబంతో కలిసి, జిల్లాలో పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నాడు.
కుప్పం వెళ్ళి, నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నాడు.. అంతలోనే గుండెపోటు వచ్చింది. యువగళం పాదయాత్ర రోజునే గుండెపోటుతో నేలకొరిగాడు తారకరత్న. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి, కుప్పంలోనే వైద్య చికిత్స అందించి, ఆ తర్వాత బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.
కానీ, తారకరత్న 23 రోజులపాటు మృత్యవుతో పోరాడి.. తుదిశ్వాస విడిచాడు. రాజకీయాల్లో రాణించాలనుకున్న తారకరత్న కోరిక నెరవేరలేదనీ, ఒత్తిడితో కూడుకున్న రాజకీయాన్ని వంటబట్టించుకునే క్రమంలోనే ఒత్తిడి తట్టుకోలేక ఆయన గుండె బలహీన పడిందని అభిమానులు అంటున్నారు.