మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఒడ్డున పడేసేందుకోసం కర్నాటక నుంచి ఓ లాబీయిస్టు వచ్చాడట. ఆయన పేరు విజయ్ కుమార్ అట. ఆయన ఓ స్వామీజీ అట. ఆయన బీజేపీ కోసం పని చేస్తుంటారట.!
ఇదీ గడచిన రెండూ మూడు రోజులుగా జరుగుతున్న ప్రచారం. టీడీపీ అనుకూల మీడియానే ఈ వ్యవహారాన్ని బయటకు లాగింది. దీన్ని జోస్యమనాలా.? ఇంకేమన్నా అనాలా.? అన్నట్టు, టీడీపీ అనుకూల మీడియా రాతల్లో కొంత నిజం వుంది. సదరు లాబీయిస్టు ప్రత్యేక విమానంలోనే వచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనూ భేటీ అయ్యారు.
ఈ విషయాన్ని స్వయంగా వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. టీటీడీ ఛైర్మన్ అయిన వైవీ సుబ్బారెడ్డికి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో బంధుత్వం కూడా వుంది. పైగా, పార్టీ సీనియర్ నేత. రీజినల్ కో-ఆర్డినేటర్‌గా ఉత్తరాంధ్ర వైసీపీ బాధ్యతల్ని చూస్తున్నారాయన.
‘ముఖ్యమంత్రిని స్వామీజీ కలిశారు, ఆశీర్వదించారు..’ అంటూ వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఆయన, రామోజీకి సన్నిహితుడనీ చెప్పుకొచ్చారు. ఇక్కడో వ్యవహారం బెడిసి కొట్టింది.
చిన్న లూప్ హోల్ దొరికితే చాలు, దాన్ని చాటంత చేసెయ్యడం టీడీపీ అనుకూల మీడియాకి అలవాటే. ‘చూశారా, మేం చెప్పింది నిజమే..’ అంటూ టీడీపీ అనుకూల మీడియా కొత్త కథ మొదలు పెట్టింది.