బహిష్కృత ఎమ్మెల్యేల ఆరోపణలు చెల్లుతాయా.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కృతులైన నలుగురు ఎమ్మెల్యేలు ఒకరొకరుగా వాయిస్ పెంచుతున్నారు. వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం మీదా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద అభ్యంతకరమైన వ్యాఖ్యలూ చేస్తున్నారు. రాజకీయాలన్నాక ఇవన్నీ మామూలే. నాలుగేళ్ళ తర్వాత ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ నేతలూ అభ్యంతరకర వ్యాఖ్యలే చేస్తుండడం హాస్యాస్పదం, ఆశ్చర్యం.

కానీ, రాజకీయాల్లో ఇవన్నీ తప్పవు. వైసీపీ పాలనలో అన్నీ అన్యాయాలే, అక్రమాలే.. అంటున్నారు సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు. గతంలో అయితే రఘురామకృష్ణరాజు ఒక్కరే. ఆ ఎంపీకి ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు తోడయ్యారు.

ఇకపై తాను ఏ పార్టీకీ చెందననీ, తాను ఇండిపెండెంట్ అనీ అంటున్న వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే వుండవల్లి శ్రీదేవి, జగనన్న కాలనీలు పెద్ద స్కామ్ అని తేల్చేశారు. చిత్రమేంటంటే, వుండవల్లి శ్రీదేవిపై గతంలో ఇసుక కుంభకోణం ఆరోపణలు వచ్చాయి. జగనన్న కాలనీల వ్యవహారంలో వుండవల్లి శ్రీదేవిపై వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు.

కాగా, బహిష్కృత ఎమ్మెల్యేలలో టీడీపీ పంచన చేరేవారెందరు.? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. ‘వాళ్ళందర్నీ టీడీపీ కొనేసింది’ అని వైసీపీ ఆరోపించినా, అందుల కొందరు టీడీపీలో చేరే అవకాశం లేదట. స్థానికంగా టీడీపీ నుంచి ఆయా ఎమ్మెల్యేల పట్ల ఎదురవుతున్న వ్యతిరేకతే అందుకు కారణమట.

ఇదిలా వుంటే, సస్పెండయిన ఎమ్మెల్యేలని వైసీపీ సీరియస్‌గా తీసుకోవడం మానేస్తే మంచిదన్న చర్చ వైసీపీ శ్రేణుల్లో జరుగుతోంది. కానీ, మాటకు మాట.. తప్పదు కదా.!

ఇంతకీ, సస్పెండ్ అయినవారిలో తిరిగి ఎమ్మెల్యేలయ్యేంత సీన్ ఎంతమందికి వుందట.?