సుప్రీం కోర్టులో మమతా బెనర్జీకి ఎదురు దెబ్బ

పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీకి సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.  సీబీఐ ఎదుట కోల్ కతా పోలీస్ కమిషనర్ విచారణకు హాజరు కావాల్సిందేనని సుప్రీం కోర్టు ఆదేశించింది. శారదా, రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణాలకు సంబంధించిన కేసులలో ఆధారాలను మాయం చేశారని కమిషనర్ రాజీవ్ కుమార్ పై ఆరోపణలున్నాయి. దానికి సంబంధించి సీబీఐ అధికారులు కోల్ కతాకు వస్తే వారిని విచారించకుండా బెంగాల్ పోలీసులు అడ్డుకున్నారు. వారకి బాసటగా సీఎం మమతా బెనర్జీ నిలిచి దీక్ష చేస్తున్నారు. దీంతో సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు విచారణకు రాజీవ్ కుమార్ హాజరు కావాల్సిందేనని ఆదేశించింది.

కోల్ కతా కమిషనర్ రాజీవ్ ను విచారించే అధికారం సీబీఐకి ఉందని, దానికి కమీషనర్ సహకరించాలని సూచించింది. ఢిల్లీ, కోల్ కతాలో కాకుండా తటస్థ వేదికలో విచారణ జరపాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసు పరిణామాల నివేదికలను సీల్డ్ కవర్ లో ధర్మాసనానికి అందజేయాలని తదుపరి విచారణను ఫిబ్రవరి 20 కి కోర్టు వాయిదా వేసింది.

కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐకి వ్యతిరేకంగా మమతా బెనర్జీ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాకు దేశవ్యాప్తంగా ఉన్న విపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. పార్లమెంటు ఉభయసభల్లో ఈ వివాదం దుమ్మురేపింది. నియంతల నుంచి దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించేందుకే తాను ధర్నా చేపట్టానని మమత ప్రకటించారు.