మాట్లాడుకోవడానికి బాగానే వుంటాయ్.! కుప్పంలో చంద్రబాబుని ఓడించేస్తాం.. పులివెందులలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఓడించేస్తాం.. లాంటి మాటలు.! కానీ, వాస్తవ పరిస్థితేంటి.? స్థానిక ఎన్నికలకు సంబంధించి కుప్పంలో టీడీపీకి వైసీపీ షాక్ ఇచ్చిన మాట వాస్తవం.
అదే సమయంలో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందుల ఓటర్లు వైసీపీకి షాక్ ఇచ్చేశారు మరి.! రాజకీయాలంటేనే అంత.! స్థానిక ఎన్నికలో, ఎమ్మెల్సీ ఎన్నికలో.. ఆయా నియోజకవర్గాల్లో వాస్తవ ఫలితాల్ని ప్రతిబింబిస్తాయని అనుకోవడం సబబు కాదు.! ఒకవేళ ఎవరైనా అది నిజమని నమ్మితే.. అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
ఇదిలా వుంటే, ‘కుప్పంలో చంద్రబాబుని దెబ్బ కొడతాం..’ అనే మాట నుంచి వైసీపీ కాస్త వెనక్కి తగ్గింది. ఈ మధ్య వైసీపీ మరీ అంతగట్టిగా ఆ మాట చెప్పడంలేదు. కానీ, టీడీపీ మాత్రం ‘పులివెందులలో వైసీపీని దెబ్బ కొడతాం..’ అంటోంది. అదే సమయంలో, పులివెందులలో వైసీపీకి పోటీగా టీడీపీ నుంచి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతను బరిలోకి దించుతారు.. అంటూ వైసీపీనే చెప్పుకుంటోంది.
ఇది దేనికి సంకేతం.? వైసీపీ భయపడుతోందా.? లేకపోతే, సునీత పేరెందుకు రాజకీయాల్లో ప్రస్తావనకు వస్తోంది. సునీత పేరుతో పోస్టర్లు రూపొందించి, మూడో కంట పడకుండా కడప జిల్లాల్లో అంటించాయి వైసీపీ శ్రేణులు. ఈ విషయంలో అత్యుత్సాహం చూపిన వైసీపీ కీలక నేత ఒకరికి అధినాయకత్వం మొట్టికాయలు వేసిందట.
కాగా, సునీత అసలు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనతో లేరనీ, పులివెందులలో టీడీపీకి ఆమె సహకరించే అవకాశమూ లేదని తెలుస్తోంది.