తన తండ్రి హత్య కేసులో నిజాలు బయటకు రావాలని మొదటి నుంచీ పోరాడుతున్నారు సునీతా రెడ్డి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో దోషులెవరన్నదీ తేలడానికి ఏళ్ళ సమయం పడుతోంది. ఎన్నేళ్ళయినా ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందని ఆశించలేని పరిస్థితి వుందిప్పుడు.!
ఏ సునీతా రెడ్డిని వెంటేసుకుని, సీబీఐ విచారణ కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నినదించారో, అదే సునీతా రెడ్డిని దోషిగా చూపుతోందిప్పుడు వైసీపీ. సునీతా రెడ్డి, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి.. ఆస్తి పంపకాల గొడవల్లో వైఎస్ వివేకానంద రెడ్డిని చంపేశారని వైసీపీ నేతలు కొందరు, సాక్షి మీడియా ద్వారా నినదిస్తున్న సంగతి తెలిసిందే.
గతంలో నారాసుర రక్త చరిత్ర అన్నారు.. ఇప్పుడేమో నర్రెడ్డి రక్త చరిత్ర అంటున్నారు. అంతలోనే, వైఎస్ వివేకానంద రెడ్డికి చాలా అక్రమ సంబంధాలున్నాయి.. అందులో ఏదో ఒక సంబంధం బెడిసి కొట్టి, ఆయన హత్యకు కారణమైందనీ వైసీపీనే చెబుతోంది.
ప్రస్తుతానికైతే ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనే అసలు దోషి.. అన్నట్లుగా ప్రచారమూ జరుగుతోంది. రాజకీయ ప్రత్యర్థులు కాదు, కుటుంబంలోనే శతృవులున్నారు వైఎస్ వివేకానంద రెడ్డికి.. అన్న విషయం తేటతెల్లమవుతోంది ఇప్పటికైతే.
ఏమో, ముందు ముందు ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయో.! సునీతా రెడ్డి, ఆమె భర్తని మాత్రం దోషులుగా వైసీపీ చూస్తోంది.