వైఎస్ జగన్ తాజా ఢిల్లీ టూర్, ప్రధానితో భేటీ వివరాలు ఇప్పటికీ గోప్యంగానే ఉన్నాయి. ఎందుకనో వైకాపా నేతలు ఆ భేటీ విషయమై మాట్లాడటానికి సుముఖంగా లేరు. కానీ వైసీపీ అనుకూలురుగా ముద్రవేయించుకున్న మీడియా మాత్రం జగన్ ఢిల్లీ టూర్ మీద ఎక్కడ లేని హైప్ క్రియేట్ చేసింది. ఈ పర్యటనతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు రానుందని ఊదరగొట్టాయి. వైఎస్ జగన్ ఎన్డీయేలో భాగస్వామ్యం అవుతారని, రాష్ట్రం తలరాత మారిపోతుందని దంచికొట్టాయి. జగన్ గనుక మోదీతో చేతులు కలిపితే చంద్రబాబు నాయుడుకు శ్రీకృష్ణ జన్మస్థానం ప్రాప్తిస్తుందని సంబరపడ్డాయి. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్, జనసేనను హేళన చేసి మాట్లాడాయి.
ఏపీలో బీజేపీ జనసేనతో పొత్తులో ఉంది. పవన్ కళ్యాణ్ జగన్ మీద ఎప్పుడూ విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. అలాంటి ఆయన అదే జగన్ ఎన్డీయేలో చేరితే ఏం చేస్తారు. ఎవరి మీద విమర్శలు గుప్పిస్తారు. ఏపీ బీజేపీకి జగన్ పెద్ద దిక్కు అవుతారు. అప్పుడు పవన్ జోకర్ అయిపోతాడు. అప్పటికీ పొత్తులోనే ఉంటే వైసీపీ కనుసన్నల్లో నడుచుకోవాల్సి వస్తుంది. కొన్నాళ్ళకు ఆ పార్టీ నిర్వీర్యం అయిపోతుంది. సిసలైన రాజకీయం అంటే ఇది. అసలు పవన్ రాజకీయాలకు పనికిరాడు. పార్టీ మూసేసి సినిమాలు చేసుకోవడం మేలు అంటూ ఎన్నో కబుర్లు చెప్పారు. పవన్ కథ ముగిసినట్టేనని విశ్లేషణలు జరిపారు. కానీ చివరికి పవన్ జోకర్ కాలేదు కానీ బ్లూ మీడియాకు మాత్రం పంక్చర్లు పడ్డాయి.
తాజాగానా బీజేపీ, వైకాపా పొత్తుల గురించి మాట్లాడిన బీజేపీ నేషనల్ సెక్రెటరీ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ కో ఇంఛార్జ్ సునీల్ దియోధర్ జగన్ ఎన్డీయేలో చేరనున్నారనే వార్తలను కొట్టిపారేశారు. ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని, తాము ఏపీలో కేవలం జనసేనలో మాత్రమే పొత్తులో ఉన్నామని, పవన్ కళ్యాణ్ తోనే తమ ప్రయాణమని తేల్చి చెప్పేశారు. ఆయన మాటలతో పవన్ జోకర్ అయిపోతాడని, జనసేనను తొక్కేస్తారని చంకలు గుద్దుకున్న ఓ మీడియా వర్గానికి గట్టి పంచ్ పడ్డట్లైంది.