చంద్రబాబుకి దూరంగా జరగడమే పవన్ కళ్యాణ్‌కి శ్రేయస్కరం.!

ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.! వ్యవస్థల్ని మేనేజ్ చేయగల దిట్టగా ఇప్పటిదాకా ‘ప్రశంసలు, విమర్శలు’ చవిచూసిన చంద్రబాబు. ఆ వ్యవస్థల్ని మేనేజ్ చేయలేక, రాజమండ్రి కేంద్ర కారాగారంలో బిక్కు బిక్కుమని కాలం గడుపుతున్నారు.! స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంతలా చంద్రబాబు కొంప ముంచేసింది.

ముందు ముందు ఈ కేసు ఏమవుతుంది.? అన్నది వేరే చర్చ. వైసీపీ గట్టిగా పూనుకుంది, చంద్రబాబుని జైల్లో పెట్టించగలిగింది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ప్రభుత్వంలో వున్నోళ్ళు ఏమైనా చేయగలరనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

నిజానికి, ఈ పరిస్థితిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకింత జాగ్రత్తగా అర్థం చేసుకుని వుండాలి. విశ్లేషించుకుని, జాగ్రత్త పడి.. వ్యూహాత్మకంగా వ్యవహరించి వుండాల్సింది పోయి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొందరపడి హంగామా చేశారు.

సరే, అప్పటికప్పుడు టీడీపీ శ్రేణుల్లో జనసేనాని పట్ల కొంత పాజిటివ్ ఇమేజ్ బిల్డప్ అయినా, ఆ వెంటనే అది చల్లారిపోయింది. ఇప్పుడేమో చంద్రబాబుకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. పలు ఇతర కేసుల్లో ఆయన్ని ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో జనసేన పేరు ‘సైడ్’ అయిపోతోంది.

ఇప్పటికైనా మించిపోయింది లేదు. జనసేనాని ఇంకాస్త జాగ్రత్తగా పరిస్థితుల్ని విశ్లేషించుకుంటే మంచిది. చంద్రబాబుతో కలిసి పని చేసినా, చెయ్యకపోయినా.. టీడీపీతో స్నేహంపై మితి మీరిన వ్యాఖ్యలు, చంద్రబాబుపై అమితమైన ప్రేమ కురిపించడం.. ఇవన్నీ జనసేన తగ్గించుకోవాల్సిందే.

కానీ, ఆ దిశగా జనసేనాని ఆలోచిస్తారా.? అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు.! చంద్రబాబుకి తానే బ్యాక్ బోన్‌లా నిలిచాననే గుడ్డి నమ్మకంతో వున్నారాయన. దాన్ని జనసైనికులే మెచ్చని పరిస్థితి వుంది. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు.. ఇటు చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్.. వెరసి జగన్ వ్యూహానికి ఈక్వేషన్స్ అనూహ్యంగా మారుతున్నాయ్.