హతఃవిధీ… జనసేనకు మళ్లీ మొదలైన “గుర్తు” టెన్షన్!

కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధన ప్రకారం ఫెర్మార్మెన్స్ లేకపోవడంతో గుర్తింపు పొందిన పార్టీగా జనసేన గుర్తింపును కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో… కేవలం రిజిస్టర్డ్‌ పార్టీగా మాత్రమే ఉంది. ఫలితంగా జనసేన పార్టీ గుర్తు అయిన “గాజు గ్లాసు” ను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది. దాన్ని ఫ్రీ సింబల్స్‌ జాబితాలో చేర్చింది.

అయితే కొద్ది రోజుల క్రితం జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. దీంతో జనసేన నేతలు సంతోషం వ్యక్తం చేశారు. అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి, అధికారులకు, సహకరించినవారందరికీ కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు. రెండు రాష్ట్రాల్లోనూ పోటీచేయబోతున్నట్లు హింట్ ఇచ్చారు. అయితే మరోసారి జనసేనకు “గుర్తు” టెన్షన్ స్టార్ట్ అయ్యింది.

అవును… ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు పరిస్థితిని చూసి చలించిపోయిన పవన్.. ఈ మేరకు అప్పుడే ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో తాను ప్రస్తుతానికి బీజేపీతో పొత్తుతో ఎన్ డీయే లో ఉన్నట్లు తెలిపారు.

టీడీపీ – జనసేన కూటమితో బీజేపీ కలిసివస్తాదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు జాతీయ పార్టీ అయిన బీజేపీతో పొత్తులో ఉన్నట్లు ప్రకటించినప్పటికీ… తెలంగాణలో మాత్రం జనసేన ఒంటరిగా పోటీ చేయనుందని అంటున్నారు. ఇది పవన్ మార్కు పాలిటిక్సేమో అనే సంగతి కాసేపు పక్కనపెడితే… అక్కడ మొత్తం 32 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది.

అయితే తెలంగాణలో జనసేనకు కొత్త టెన్షన్ వచ్చి పడింది. ఇందులో భాగంగా… తెలంగాణలో జనసేన పోటీ చేస్తున్న 32 స్థానాల్లో “గాజు గ్లాసు” గుర్తును ఆ పార్టీకి ఈసీ కేటాయించింది. మిగిలిన చోట్ల ఆ సింబల్‌ ను ఎవరైనా ఇండిపెంటెంట్‌ అభ్యర్థులు కోరుకుంటే వారికి కేటాయించనుంది. ఇదే సమయంలో “జాతీయ జనసేన” పేరుతో ఇంకో పార్టీ రంగ ప్రవేశం చేసింది.

అయితే ఏముంది.. పేరే కదా కలిసింది అని అనుకుంటే పొరపాటే… దీనికి కేంద్ర ఎన్నికల సంఘం.. “బకెట్‌” గుర్తును కేటాయించింది. ఇది దాదాపు జనసేన గుర్తు అయిన “గాజు గ్లాసు”ను తలపించేలా ఉంది. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పోటీ చేసేందుకు జాతీయ జనసేనకు ఈసీ బకెట్‌ గుర్తును కేటాయించింది. దీంతో తెలంగాణ జనసేన నేతలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారంట.

ఈ బకెట్‌ గుర్తు జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును పోలి ఉండటంతోపాటు పార్టీ పేరు కూడా జనసేన పార్టీని తలపించేలా ఉండటం ఇప్పుడు ఆ పార్టీకి వచిన కొత్త సమస్య అని చెబుతున్నారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఇలాంటి సమస్య వల్ల తెలంగాణలో జనసేనకు పెద్దగా కలిసొచ్చేది, పోయేది కూడా ఉండకపోవచ్చు కానీ… సపోజ్ ఆంధ్రప్రదేశ్‌ లో మరే ఇతర పార్టీకి లేదా అభ్యర్థులకు అయినా బకెట్‌ గుర్తును కేటాయిస్తే అది జనసేనకు పెద్ద తలనొప్పిగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు పరిశీలకులు. ఏది ఏమైనా… పార్టీ పెట్టి పదేళ్లు అయినప్పటికీ జనసేన పార్టీకి ఈ గుర్తు తలనొప్పులేమిటో అర్ధం కావడం లేదన్ని జనసైనికులు ఫీలవుతున్నారంట.