వైఎస్ జగన్ తనను నమ్మిన వ్యక్తులను, తన కోసం పనిచేసిన మనుషులను విస్మరించరనేది సుస్ఫష్టమై విషయం. జగన్ ద్వారా మాట తీసుకున్న వ్యక్తుల్లో చాలామంది ఇప్పుడు మంత్రులుగా, ఎమ్మెల్సీలుగా, ఇతర కీలకమైన నామినేటెడ్ పదవుల్లోనూ ఉన్నారు. అలా జగన్ అభిమానాన్ని చూరగొన్న వ్యక్తుల్లో సినీ నటుడు పృథ్వీ ఒకరు. ఎన్నికలకు చాలా నెలల ముందే వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఆయన జగన్ ముఖ్యమంత్రి కావాలని చాలా కష్టపడి పనిచేశారు. ఎవ్వరూ పిలవకపోయినా ర్యాలీలకు, సభలకు, సమావేశాలకు వెళుతూ జగన్ దృష్టిలో పడ్డారు.
జగన్ ఆదరణ దొరకడంతో పార్టీలో కూడ ఆయనకు మర్యాద పెరిగింది. ఆ ఉత్సాహంతో పృథవీ ఇంకాస్త ఎక్కువగా కష్టపడ్డారు. ఆయన కష్టం చూసి జగన్ సీఎం అయ్యాక పృథ్వీకి పెద్ద పోస్ట్ ఏదో ఒకటి ఇస్తారని అంతా అనుకోగా అంతకు మించి చేశారు జగన్. టీటీడీ భక్తి ఛానల్ ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిని పృథ్వీకి కట్టబెట్టారు. నిజానికి ఆ పదవి కోసం ఎంతోమంది పెద్ద పెద్ద సిఫార్సులు తెచ్చుకుంటుంటారు. అలాంటి పదవికి పృథ్వీకి ఇచ్చారు. కానీ పృథ్వీ ఆ పదవిని నిలుపుకోలేకపోయారు. రెండేళ్ల పదవీకాలం ముగియకుండానే దిగిపోయారు.
హుందా అయినా పదవిలో ఉన్న ఆయన మీద మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలు, బయటికొచ్చిన ఆడియో రికార్డులు పృథ్వీ మీద నెగెటివ్ ముద్ర వేశాయి. ప్రజల్లో ఆయన మీద వ్యతిరేకత పెరిగింది. ఆయన మీదే కాదు ఆయన్ను కోరి నియమించిన జగన్ మీద కూడ కోపగించుకున్నారు భక్తులు. దీంతో ఆయన్ను పదవి నుండి దించేశారు. అలా తగని వ్యక్తిని పదవిలో కూర్చోబెట్టి ఇబ్బందిపడిన జగన్ ఇప్పుడు అన్ని అర్హతలు కలిగిన డాక్టర్ వి.భాస్కర సాయికృష్ణ యాచేంద్రను పదవిలోకి తెచ్చి ఆ ముద్రను చెరుపుకున్నారు.
నెల్లూరు జిల్లాకు చెందిన యాచేంద్ర సంగీత గేయధార సృష్టికర్తగా చాలా ప్రసిద్ధులు. తెలుగు మీద, తెలుగు సాహిత్యం మీద అపారమైన జ్ఞానం ఉన్నవారు. ఎస్వీబీసీ చైర్మన్ పదవిలో కూర్చోడానికి కావాల్సిన అర్హతలన్నీ ఆయనకున్నాయి. ఈ నియామకంతో శ్రీవారి భక్తులు జగన్ సెలక్షన్ సూపర్ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.