వారాహియాత్ర రెండో దశలో భాగంగా ఏలూర్ సభలో వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు హోరెత్తిపోతున్నాయి. ఈ సమయంలో వాలంటీర్లకు కౌంటర్ గా లాజిక్ లేని వాదనతో జనసేన కార్యకర్తలు కూడా రోడ్లెక్కుతున్నారని అంటున్నారు.
పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు ఒక పక్క వారంతా పవన్ ఫోటోలను చెప్పులతో కొడుతూ.. దిష్టిబొమ్మలను దహనం చేస్తూ.. శాపనార్థాలు పెడుతు.. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తాడో చూస్తామంటూ ఛాలెంజ్ లు చేస్తుంటే.. పవన్ కల్యాణ్ వాలంటీర్లపై అనని మాటలను అన్నట్లుగా జగన్ సర్కార్ చిత్రీకరిస్తుందని నిసిగ్గు వాదనతో రోడ్లపైకి వస్తున్నారంట జనసైనికులు.
అవును… పవన్ పై జగన్ సర్కార్ కావాలని కక్షగట్టి వాలంటీర్లను ఉసిగొల్పుతుందనే వాదనతో జనసేన నేతలు రోడ్లపైకి వస్తున్నారంట. ఇంత నిస్సిగ్గు వాదన కూడా ఉంటుందా అనే చర్చ సంగతి కాసేపు పక్కనపెడితే… అలా రోడ్లపైకి వచ్చిన జనసేన నేతలు జగన్ దిష్టిబొమ్మలను తగులబెట్టేపనికి పూనుకుంటున్నారంట.
దీంతో ఈ సమయంలో రంగంలోకి దిగిన పోలీసులకూ జనసేన నేతలకు మధ్య వాగ్వాదం జరగడాలు, హౌస్ అరెస్టులూ జరుగుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన నేతను పట్టుకుని.. ఒక మహిళా సీఐ రెండు చెంపలు వాయించిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
అవును… తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసిందని తెలుస్తుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్… వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు వారంతా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తుంటే… కొంతమంది జనసేన కార్యకర్తలు సీఎం దిష్టి బొమ్మలు దహనం చేసే పనికి పూనుకుంటున్నారట.
ఇందులో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని పెళ్లిమండం వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు జనసేన నేతలు ప్రయత్నించగా… అందుకు ఏమాత్రం అంగీకరించమని మహిళా సీఐ అంజు యాదవ్ వారికి తెలిపారట. అయినా కూడా జనసేన నేతలు ఆ ప్రయత్నాలు చేశారని తెలుస్తుంది.
అలా దిష్టిబొమ్మ దహనానికి అడ్డుకుంటున్నా కూడా యత్నించడంతో పలువురు నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారట. ఈ సమయంలో పోలీసులను ఏమార్చిన కొంతమంది జనసేన నేతలు ఇంటి గోడలు దాటి కూడలి వద్దకు చేరుకున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో గృహనిర్బందం చేసినా కూడా తప్పించుకుని రోడ్లపైకి వచ్చి సీఎం దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించిన జనసేన నేతలపై సీఐ చేయిచేసుకున్నారని తెలుస్తుంది.
ఈ సందర్భంగా జనసేన నేత రెండు చెంపలపైనా ఆమె కొట్టారని తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొందని… పరిస్థితి సద్దుమణిగి, జనసేన నేతలు చక్కబడుతున్నారని అంటున్నారు! మరోపక్క ఇలా మహిళా సీఐ ఒకరు జనసేననేతను నడిరోడ్డుపై రెండు చెంపలూ వాయించిన విషయంపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.
మరోపక్క లేడీ సింగం అంటూ కొంతమంది నెటిజన్లు ఆన్ లైన్ లో పోస్టులు పెడుతున్నారని అంటున్నారు. ఏది ఏమైనా… ఇప్పుడు ఈ మహిళా సీఐ కి వాలంటీర్లు అంతా ఫ్యాన్స్ అయిపోరానే కామెంట్లు వినిపిస్తుండటం కొసమెరుపు!