జనసేన నేత చెంపలు వాయించిన సీఐ కోసం… శ్రీకాళహస్తికి పవన్!

శ్రీకాళహస్తిలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసే విషయంలో పోలీసులకు మాట వినకుండా రెచ్చిపోయినందుకు జనసేన పార్టీ నేత ఒకరిని స్థానిక సీఎం రెండు చెంపలూ వాయించారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

శ్రీకాళహస్తిలో జనసేన నేత చెంపలు వాయించిన సీఐ సంఘటనపై పవన్ కల్యాణ్ సీరియస్ గా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… ఆ సీఐ సంగతి శ్రీకాళహస్తిలోనే చూసుకుంటా అంటూ చెప్పుకొచ్చారు. ఈ సమయంలో సోమవారం ఈ మేరకు పవన్ శ్రీకాళహస్తికి వెళ్లనున్నారని తెలిసింది.

అవును… జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ సోమవారం తిరుపతి వెళ్లనున్నారని తెలుస్తుంది. శ్రీకాళహస్తి ఘటనపై తిరుపతి ఎస్పీని కలిసి.. సీఐ అంజూ యాదవ్‌ పై ఫిర్యాదు చేయనున్నారట. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పవన్‌ డిమాండ్‌ చేయనున్నారని అంటున్నారు. ఈమేరకు ఎస్పీకి వినతిపత్రం అందించనున్నారని అంటున్నారు.

దీనికి సంబంధించి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

“శ్రీకాళహస్తిలో నిరసన తెలుపుతున్న జనసేన నాయకుడు కొట్టె సాయిపై అమానుషంగా దాడి చేశారు సీఐ అంజూ యాదవ్‌. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ సోమవారం ఉదయం జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందించనున్నారు పవన్‌. తద్వారా డీజీపీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించాం.” అని మనోహర్ తెలిపారు.

ఇదే సమయంలో “దీనికి సంబంధించి శనివారం మధ్యాహ్నం ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులతో టెలీ కాన్ఫరెన్స్‌ సమావేశం నిర్వహించాం. సోమవారం ఉదయం 9.30 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు పవన్‌. 10.30గంటలకు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేస్తారు” అని ప్రకటించారు.

అనంతరం… “ఈ కార్యక్రమాన్ని శాంతియుత, క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాం” అని నాదెండ్ల మనోహర్‌ ఈ ప్రకటనలో తెలిపారు.